మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ లో ఘనంగా అయ్యప్ప మహా పడిపూజ
  • అయ్యప్ప శరణుఘోషతో మార్మోగిన పాలమూరు

మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ అర్బన్, వెలుగు : అయ్యప్పస్వామి నామస్మరణ, శరణుఘోషలతో మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ పట్టణం మార్మోగింది. హరిహర పుత్రుడు అయ్యప్ప మహాపడి పూజ సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వాములు నిర్వహించిన శోభాయాత్ర కనుల పండువగా సాగింది. ముందుగా స్థానిక తూర్పు కమాన్‌‌‌‌‌‌‌‌ వద్ద గల ఆంజనేయస్వామి దేవాలయంలో స్వామివారి ఆభరణాలు, ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి,  శోభాయాత్రను ప్రారంభించారు. 

అనంతరం అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పల్లకిలో ఉంచి.. మాలధారణ చేసిన స్వాములంతా తిరు ఆభరణాలను తలపై పెట్టుకొని క్లాక్‌‌‌‌‌‌‌‌ టవర్‌‌‌‌‌‌‌‌, న్యూటౌన్‌‌‌‌‌‌‌‌ మీదుగా అయ్యప్పకొండ వరకు ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ ఊరేగింపులో బీజేపీ ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. 

వందలాది మంది అయ్యప్పభక్తులు   భజనలు, కోలాటాలు, డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. స్వయంగా అయ్యప్ప స్వాములకు భక్తులకు ఆయన అన్నప్రసాదం వడ్డించారు.   

అయ్యప్పకొండపై వైభవంగా మహాపడి పూజ..

పద్మావతి కాలనీలోని అయ్యప్పకొండపై తిరుపతి వాస్తవ్యులు గురుస్వామి వెంకటేశ్వరశర్మ, పాలమూరు పట్టణ గురుస్వాముల ఆధ్వర్యంలో ఏకశిల దివ్య పడునెట్టెంపడి పూజ, మహామంగళ హారతి ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య కలశం పూజలు నిర్వహించి, ఏకశిలా 18 పడిమెట్లపై జ్యోతులు వెలిగించారు. ఈ సందర్భంగా అయ్యప్ప పాటలతో కొండ మార్మోగింది. స్వాములు పెద్దసంఖ్యలో హాజరై భక్తి పాటలు ఆలపిస్తూ తన్మయత్వానికిలోనయ్యారు.