వివాహేతర సంబంధం పెట్టుకొని.. భర్తను కడతేర్చిన మహిళా టీచర్

వివాహేతర సంబంధం పెట్టుకొని.. భర్తను కడతేర్చిన మహిళా టీచర్
  • టీచరైన ప్రియుడితో కలిసి ఘాతుకం
  • నెల రోజుల హైడ్రామా తర్వాత ఇద్దరిని అరెస్ట్​ చేసిన పోలీసులు 
  • అచ్చంపేటలో ఘటన 

అచ్చంపేట, వెలుగు: ప్రియుడి మోజులో పడి, అతనితో కలిసి భర్తను చంపేసింది ఓ మహిళా టీచర్. నెల రోజుల హైడ్రామా తర్వాత నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటన నాగర్​కర్నూల్ ​జిల్లా అచ్చంపేట పట్టణంలో చోటుచేసుకుంది. సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కు చెందిన లక్ష్మణ్ నాయక్, పద్మ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పద్మ టీచర్​ కావడంతో ఉద్యోగరీత్యా కుటుంబం అచ్చంపేట పట్టణంలోని మారుతీనగర్ లో నివాసం ఉంటోంది.

 పద్మ  ఉప్పునుంతల మండలం గట్టుకాడిపల్లి తండా పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది. ఇదే మండలంలోని మరో పాఠశాలలో పనిచేసే రాత్లావత్ గోపితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తమ ప్రేమాయణానికి భర్త లక్ష్మణ్ అడ్డుగా ఉన్నాడని భావించిన పద్మ ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్​చేసింది. గత నెల 25న నిద్రిస్తున్న లక్ష్మణ్​ను ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

 పద్మ మరుసటి రోజు ఏమీ తెలియనట్టు స్కూల్ కు  వెళ్లిపోయింది. తర్వాత ఇంటి యజమానికి ఫోన్ చేసి తన భర్త స్పృహ తప్పి పడిపోయాడని డ్రామా ఆడింది. పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ దర్యాప్తులో అసలు నిజం బయటపడింది.  పోస్టుమార్టం నివేదిక, కాల్ డేటా ఆధారంగా పద్మ, గోపిల బంధం బయటపడటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. హ్యత చేసినట్లు ఒప్పుకోవడంతో నిందితులను గురువారం అరెస్ట్​చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.  

మరో ఇద్దరిని తప్పించారనే ఆరోపణలు..

లక్ష్మణ్​హత్య కేసులో మరో ఇద్దరు టీచర్ల పాత్ర ఉందని, వారిని తప్పించినట్లు ఆరోపణలున్నాయి. కొందరు నేతల ఒత్తిళ్లతోనే అధికారులు ఇలా చేశారని అచ్చంపేట పట్టణంలో చర్చ జరుగుతోంది. మృతుడి కుటుంబసభ్యులు ఓ ప్రజాప్రతినిధి ద్వారా తీవ్ర ఒత్తిడి తేవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరు ఉపాధ్యాయులను తప్పించి, ప్రియుడు, ప్రేయసిని మాత్రమే హంతకులుగా చూయించారని చర్చించుకుంటున్నారు.