బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో ఆలయ పూజారిపై దాడి

బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో ఆలయ పూజారిపై దాడి

కందనూలు, వెలుగు : ఆలయ పూజారిపై దాడి చేసిన ఘటన బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బిజినేపల్లి మండలం పాలెం గ్రామ శివారులోని ఆర్ఏఆర్ఎస్ ఆంజనేయస్వామి ఆలయంలో వెల్దండ సురేశ్ శర్మ గత పదేండ్లుగా పూజలు నిర్వహిస్తున్నాడు. రోజుమాదిరిగా గురువారం ఆంజనేయస్వామి ఆలయంలో ఆయన పూజలు చేస్తున్నాడు. పాలెం గ్రామానికి చెందిన గుడి స్థలదాత వెంకటేశ్వర్ రెడ్డి.. ఆలయానికి చేరుకొని పూజారిపై దౌర్జన్యానికి దిగాడు. 

ఆలయ ప్రాంగణంలో నిర్మించిన షెటర్ల రెంట్ విషయంలో పూజారి సురేశ్.. వెంకటేశ్వరెడ్డికి మధ్య వివాదం నెలకొంది. ఏదైన సమస్య ఉంటే ఆలయ కమిటీకి చెప్పాలని పూజారి కోరడంతో వెంకటేశ్వర్ రెడ్డి రెచ్చిపోయి దాడికి పాల్పడ్డాడు. గుడిలోనే దాడి చేయడంతో పూజారి ఆలయ ప్రాంగణంలోనే కూర్చుని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు అక్కడికి చేరుకొని పూజారికి మద్దతుగా రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. 

దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. నాగర్ కర్నూల్ డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్ వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని ఏం జరిగిందో తెలుసుకున్నారు. దాడి చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.