గద్వాల, వెలుగు : దేశంలో ఉపాధి హామీ పథకాన్ని నీరుగారిచేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు ఆరోపించారు. గురువారం గద్వాలలో డసీసీ అధ్యక్షుడి పదవి ప్రమాణస్వీకారోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ఆకలిచావులు ఉండొద్దనే ఉద్దేశంతో మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఈ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రధాని మోదీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి గతంలో కేంద్ర ప్రభుత్వమే 100 శాతం నిధులు ఇచ్చేదని, ఇప్పుడు కేంద్రం 60, రాష్ట్రం 40 శాతం అంటూ కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో గాంధీ పేరు ఉండకూడదనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించారన్నారు. దేశంలో అన్ని కులాలు ఉన్నాయని, కానీ ఓట్ల రాజకీయం కోసం రాముడు పేరును కూడా బీజేపీ వాళ్లు వాడుకుంటున్నారని విమర్శించారు.
ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ పై రాహుల్ గాంధీ ప్రైవేట్ బిల్లు పెడుతున్నారని చెప్పారు. అప్పుడు ఏ పార్టీ అడ్డుపడుతుందో తేలిపోతుందన్నారు.
