- వినియోగదారులు చేజారకుండా సింగరేణి ప్రయత్నాలు
- క్వాలిటీ లేదంటూ కొర్రీలు పెడుతున్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలు
- రామగుండం, సత్తుపల్లిలో కోల్ వాషరీ ప్లాంట్ల ఏర్పాటుకు నిర్ణయం
కోల్‌బెల్ట్, వెలుగు : క్వాలిటీతో పాటు తక్కువ రేటుకు దొరికే బొగ్గును కొనుగోలు చేసేందుకు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో 80 శాతం ప్రభుత్వ విద్యుత్ కేంద్రాలకే సప్లై చేస్తోంది. అయితే బొగ్గు క్వాలిటీ సరిగా లేదని, ధర కూడా ఎక్కువగా ఉందంటూ సింగరేణి బొగ్గు కొనేందుకు ఆయా సంస్థలు విముఖత చూపుతున్నాయి. దీంతో ఇప్పటికే ఉన్న వినియోగదారులను కాపాడుకోవడంతో పాటు కొత్త వినియోగదారులను సైతం ఆకట్టుకునేందుకు సింగరేణి చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సాధ్యమైనంత ఎక్కువ మొత్తంలో క్వాలిటీ బొగ్గును సరఫరా చేసేందుకు కొత్తగా రెండు కోల్ వాషరీ ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది.
క్వాలిటీ లేదంటూ ప్రభుత్వ సంస్థల కొర్రీ
సింగరేణి సంస్థ రోజుకు సుమారు 2 లక్షల టన్నులకుపైగా బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా.. ఇందులో 80 శాతం విద్యుత్ కేంద్రాలకు రవాణా చేస్తోంది. ఎన్టీపీసీతో పాటు తెలంగాణ, ఏపీ జెన్‌కో, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని విద్యుత్ కేంద్రాలకు బొగ్గును సరఫరా చేస్తోంది. మిగిలిన 20 శాతం బొగ్గును విద్యుతేతర పరిశ్రమలకు అమ్ముతోంది. 20 శాతం కొనుగోలు చేస్తున్న సంస్థలతో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా... 80 శాతం కొనుగోలు చేస్తున్న పరిశ్రమలే కొర్రీలు పెడుతున్నాయి. కొన్ని ప్రైవేట్ కోల్ సంస్థలు సింగరేణి కంటే నాణ్యమైన బొగ్గును తక్కువ ధరకే సప్తై చేస్తుండడంతో విద్యుత్ కంపెనీలు అటు మొగ్గు చూపుతున్నాయి.
సింగరేణికి అతిపెద్ద వినియోగదారైన ఎన్టీపీసీ ఏటా 12 మిలియన్ టన్నుల బొగ్గును కొనుగోలు చేస్తోంది. రోజుకు సుమారు 35 వేల టన్నుల బొగ్గును మండించే ఎన్టీపీసీ పక్కనే ఉన్న సింగరేణి గనుల నుంచి బొగ్గును తీసుకుంటుంది. రైల్వే వ్యాగన్ల ద్వారా బొగ్గు తీసుకుంటున్నా ధర ఎక్కువగా ఉంటుండడంతో ప్రైవేట్ కోల్ సంస్థల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సకాలంలో బొగ్గును రవాణా చేస్తుందన్న నమ్మకంతోనే ఇప్పటివరకు సింగరేణి బొగ్గును కొనుగోలు చేసిన సంస్థలు.. భవిష్యత్‌లో తక్కువ రేటుకు దొరికే క్వాలిటీ బొగ్గునే కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి.
రెండు చోట్ల కోల్ వాషరీ ప్లాంట్లు
కోల్‌వాషరీ ప్లాంట్ల ద్వారా క్వాలిటీ బొగ్గు అందించే అవకాశం ఉన్నప్పటికీ... ఈ విధానంలో 40 శాతం బొగ్గు వృథాగా పోతుంది. ఈ కారణం వల్ల కోల్‌వాషరీ ప్లాంట్ల ఏర్పాటుపై సింగరేణి ఇప్పటివరకు దృష్టి సారించలేదు. కానీ ప్రస్తుతం మార్కెట్‌లో పోటీ పెరగడంతో ఇప్పటికే ఉన్న వినియోగదారులను కాపాడుకోవడంతో పాటు కొత్త వారిని ఆకట్టుకునేందుకు సింగరేణి ప్రయత్నాలు మొదలు పెట్టింది. 2026–-27 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి 65 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడంతో అదే స్థాయిలో రవాణా చేయాలని భావిస్తోంది. అయితే సింగరేణి గనుల్లో చాలా వరకు తక్కువ గ్రేడ్ బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఆరు జిల్లాల పరిధిలోని గనుల్లో ఎక్కువ శాతం జీ-9 నుంచి జీ13 గ్రేడ్ బొగ్గు నిల్వలే ఉన్నాయి.
కేవలం భూపాలపల్లి ప్రాంతంలోనే కొంత మేర నాణ్యమైన బొగ్గు దొరుకుంది. అయితే క్వాలిటీ తక్కువగా ఉన్న బొగ్గును పూర్తి స్థాయిలో శుభ్రం చేయడం వల్ల కొంత మేర క్వాలిటీ పెరిగే అవకాశం ఉంటుంది. సింగరేణికి మణుగూరు, మందమర్రి, కొత్తగూడెం ప్రాంతాల్లో కోల్ వాషరీ ప్లాంట్లు ఉండగా... వివిధ కారణాల వల్ల మందమర్రి, రామగుండం ప్రాంతంలోని ప్లాంట్లు మూతపడ్డాయి. తాజాగా బొగ్గు క్వాలిటీని పెంచడంలో భాగంగా సత్తుపల్లి, రామగుండం ఏరియాల్లో కొత్త కోల్‌వాషరీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. గనుల్లో ఉత్పత్తి చేసిన బొగ్గును కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లకు తరలించగా.. బండ, మట్టిని వేరు చేసిన అనంతరం కోల్ వాషరీ ప్లాంట్లలో క్లీన్ చేయడం వల్ల బొగ్గు గ్రేడ్, క్వాలిటీ పెరుగుతుంది. దీంతో రెండు ప్లాంట్ల
ఏర్పాటుకు సింగరేణి సిద్ధమైంది.
వివిధ రకాల గ్రేడ్లు మిక్స్ చేసి...
సాధ్యమైనంత క్వాలిటీ బొగ్గు సరఫరా చేసేందుకు సింగరేణి సంస్థ చర్యలు చేపడుతుంది. ఇటీవలి కాలంలో సంస్థ ఉత్పత్తి చేస్తున్న జీ15 గ్రేడ్ బొగ్గును కొనేందుకు థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిరాకరిస్తున్నాయి. కెలోరిఫిక్ వాల్యూ (క్వాలిటీ) తక్కువగా ఉండడం వల్ల విద్యుత్ ఉత్పత్తి కెపాసిటీ తగ్గిపోతుందని ఆయా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం వినియోగదారులకు క్వాలిటీ బొగ్గు ఇవ్వకపోతే నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. నాణ్యమైన బొగ్గు సరఫరా చేయకుండా నష్టపరిహారం చెల్లించే బదులు.. వివిధ రకాల గ్రేడ్లు మిక్స్ చేసి రవాణా చేయడమే మేలని భావించిన యాజమాన్యం ఆ దిశగా చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా సింగరేణి ఉత్పత్తి చేస్తున్న జీ-10, జీ-11, జీ-13, జీ-14, జీ-15లతో పాటు మరికొన్ని గ్రేడ్‌లను కలిపి జీ-13గా మార్చి వినియోగదారులకు సప్లై చేస్తోంది. ఇప్పటికే బొగ్గు సరఫరాలో జాయింట్ షాంప్లింగ్ విధానంలో థర్డ్ పార్టీ క్వాలిటీ పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రతి రోజు దాదాపుగా రూ.5 కోట్ల విలువైన బొగ్గును సింగరేణి సంస్థ వినియోగదారులకు సప్లై చేస్తోంది.

