- నారాయణతో పాటు సీపీఐ నేతల అరెస్ట్
- కార్మికులు, పోలీసులకు నడుమ తోపులాట
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మెడికల్ బోర్డును పునరుద్ధరించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. సీపీఐ నేత నారాయణతో పాటు నాయకులను పోలీసులు అరెస్ట్ చేయగా, కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో కోల్‌బెల్ట్ వ్యాప్తంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర సోమవారం కొత్తగూడెంలో ముగిసింది. పట్టణంలో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సింగరేణి హెడ్డాఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. నేలపై పడుకొని నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నల్ల బంగారం వెలికితీస్తున్న కార్మికులు పోరాడి సాధించుకున్న మెడికల్ బోర్డును రద్దు చేయడం దారుణమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణిని దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణికి రావాల్సిన రూ.50వేల కోట్ల బకాయిలు చెల్లించడం లేదన్నారు.
కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, మంత్రులు విమానాలు, హెలీ కాప్టర్లలో తిరుగుతూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. బొగ్గు ఉత్పత్తి చేస్తున్న కార్మికుల సొమ్మును ప్రభుత్వం ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.
సింగరేణిలో అనేక కుంభకోణాలు చేసిన వారితో పాటు గత సీఎండీపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరించకుంటే హెడ్డాఫీస్ను ఆక్రమిస్తామని హెచ్చరించారు. యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కె.రాజ్ కుమార్ మాట్లాడుతూ మారు పేర్లతో పాటు డిస్మిస్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మిర్యాల రంగయ్య, వంగా వెంకట్, రమణమూర్తి, కె.సారయ్య పాల్గొన్నారు.
నేతల అరెస్ట్..
హెడ్డాఫీస్ గేట్ల ఎదుట సీపీఐ, యూనియన్ నేతలు పడుకొని నిరసన తెలిపారు. లంచ్ టైంలో హెడ్డాఫీస్లో పని చేస్తున్న ఆఫీసర్లు, ఉద్యోగులు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో పోలీసులు నారాయణతో పాటు యూనియన్ నేతలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో పోలీస్ వెహికల్స్‌ను కార్మికులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
మంచిర్యాలలో రిటైర్డు ఉద్యోగుల ధర్నా..
కోల్‌బెల్ట్: సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ పెంచాలనే డిమాండ్ చేస్తూ న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళనకు మద్దతుగా సోమవారం మంచిర్యాలలో సింగరేణి రిటైర్డు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
సింగరేణి జిల్లా రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీగా ఐబీ చౌరస్తాకు చేరుకున్నారు.అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నాకు దిగారు. సంఘం జిల్లా అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో పని చేసి రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్ 28 ఏళ్లుగా ఒక శాతం కూడా పెంచలేదన్నారు.
మూడేండ్లకోసారి పెన్షన్ రివైజ్చేయాలనే ఒప్పందం ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం, కోలిండియా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. కరువుభత్యంతో కూడిన 50 శాతం పెన్షన్ పెంచాలని, కనీస పెన్షన్ రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఆర్ ఎంఎస్ హెల్త్‌కార్డు పరమితిని రూ.25 లక్షలకు పెంచాలన్నారు. సంఘం నేతలు పానగంటి పోషం, మహేందర్ రాజు, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, కాసిపేటకు చెందిన రిటైర్డు ఉద్యోగులు పాల్గొన్నారు.
