లాభాల వాటాపై ఉద్యోగులకు స్పష్టత ఇచ్చిన సింగరేణి

లాభాల వాటాపై ఉద్యోగులకు స్పష్టత ఇచ్చిన సింగరేణి

మందమర్రి,వెలుగు: సింగరేణి కంపెనీకి 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.1,227 కోట్ల నికర లాభాల్లో కార్మికుల వాటాగా 30 శాతం రూ.368 కోట్లను అక్టోబర్​1 నాటికి అన్​రోల్​లో ఉన్న కార్మికులు, ఉద్యోగులకు వారి బ్యాంకు ఖాతాల్లో సింగరేణి యాజమాన్యం జమచేయనుంది. ఏయే ప్రాతిపదికన ఎవరెవరికి ఎంత మొత్తం లాభాల వాటా చెల్లించనుందనే విషయాన్ని స్పష్టం చేస్తూ గురువారం సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో హాజరుపై 84 శాతం, వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా 2 శాతం, సామూహిక ప్రతిభకు 14 శాతం చెల్లించనున్నారు. 2021–-22 ఆర్థిక సంవత్సరం సాధించిన 65.02 మిలియన్​ టన్నుల్లో ప్రతి కార్మికుడు 6.09 టన్నుల బొగ్గును సాధించినట్లు లెక్కించింది. దాని ప్రకారం హాజరు ప్రాతిపదికన ఎక్కువ శాతం పంపిణీ చేసి మిగితావి ప్రోత్సాహక పథకానికి అర్హత సాధించిన ఉద్యోగులకు పంపిణీ చేయనుంది. సింగరేణి వ్యాప్తంగా 44,500 మంది కార్మికులకు వాటా అందనుంది. లాభాల్లో 30శాతం వాటా ఇవ్వడం మామూలు విషయం కాదని, టీఆర్ఎస్​ సర్కారు నిర్ణయంతో కార్మికులకు ఎంతో ప్రయోజనం కలిగిందని గుర్తింపు కార్మిక సంఘం నేతలు అంటుండగా, ఎప్పట్లాగే లాభాలు తగ్గించి చూపి, కార్మికులను మరోసారి మోసగించారని బీఎంఎస్, ఏఐటీయూసీ, -హెచ్​ఎంఎస్​లాంటి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. 

హాజరుపై రూ. 309. 21 కోట్లు..

కార్మికుల హాజరుపై 84 శాతం వాటాను పంపిణి చేయనున్నారు. అంటే లాభాల వాటా రూ.368 కోట్లలో  నుంచి రూ.309.21 కోట్లను హాజరుపైనే కార్మికులకు పంచేందుకు నిర్ణయించారు. హాజరు ఆధారంగా కార్మికులు, ఆధికారులు, సూపర్​వైజర్ల వాటాను పంపిణీ చేయనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. వంద మస్టర్ల కంటే తక్కువ ఉన్న కార్మికులకు ఈ పథకం అమలు కాదు. శిక్షణ ఉద్యోగుల్లో 2022 మార్చి 31 నాటికి ఏడాది పూర్తి చేసి వంద మస్టర్లు చేసినవారు అర్హులు. అండర్​గ్రౌండ్​మైన్లలో పనిచేసే కార్మికులకు ప్రతి మస్టరుపై రూ.347.75 చొప్పున, యూజీ గనులు/ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌‌లలో సీహెచ్​పీలు, సీఎస్​పీలు, ఎస్టీపీపీల​ఉద్యోగులకు మస్టర్​పై రూ.275.30 చొప్పున చెల్లిస్తారు.  ఉపరితల విభాగాలలోని ఉద్యోగులకు ప్రతి మస్టర్​కు రూ.254.12 చొప్పున పంపిణీ చేస్తారు. 

ప్రోత్సాహక ప్రయోజనం అదనం

ఏడాదిలో పనితీరు మెరుగ్గా ఉన్న కార్మికులకు అదనంగా వాటా పంపిణీ చేయనున్నారు. వ్యక్తిగత ప్రతిభకు 2 శాతం పంపిణీ చేయనున్నారు. కార్పొరేట్ ఆమోదిత ప్రోత్సాహక పథకాల పరిధిలోకి వచ్చే మైన్స్ / సీఎస్​పీలు,  వర్క్​షాప్స్​లో పనిచేసే ఎంప్లాయీస్​కు ప్రత్యేకంగా రూ.7.36 కోట్లు పంపిణీ చేయనున్నారు. 2021–--22 సంవత్సరంలో అర్హులైన ప్రతి ఉద్యోగికి చెల్లించిన ప్రోత్సాహక పథకం మొత్తంలో (అంటే రూ.7.92 కోట్లు) 92శాతం పైగా చెల్లిస్తారు. సింగరేణి వ్యాప్తంగా వ్యక్తిగతంగా కంపెనీ ఉత్పత్తి, ఉత్పాదకతకు సహకరించిన వారిని గుర్తించి ఈ మొత్తాన్ని పంపిణీ చేస్తారు. 84 శాతం మస్టర్ల ప్రాతిపదికన పొందినవారికి కూడా వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా 2 శాతంలోనూ చాన్స్​ ఉంటుంది. గ్రూప్​ప్రతిభ కనబరించిన ఉద్యోగులకు కూడా ప్రత్యేక వాటా చెల్లించనున్నారు. ఉద్యోగులకు 14 శాతం అంటే రూ.51.54 కోట్లు పంపిణీ చేయనున్నారు. బొగ్గు ఉత్పత్తి టార్గెట్​తో పాటు గని, డివిజన్​లో నిర్దేశిత ఉత్పత్తి సాధనలో భాగస్వాములైన ఎంప్లాయీస్​కు 14 శాతం వాటాను విభజించి పంపిణీ చేస్తారు. అక్టోబర్ లో జీతంతో పాటు  ప్రతి కార్మికుడు లాభాల వాటాగా  రూ.40 వేల నుంచి రూ. లక్ష వరకు అందుకోనున్నారు.  

దసరా అడ్వాన్స్.. దీపావళి బోనస్​ 

సింగరేణి కార్మికులు దసరా అడ్వాన్స్​, దీపావళి బోనస్ మొత్తాలను కూడా అక్టోబర్​ నెలలో అందుకోనున్నారు. ఇప్పటికే సింగరేణి యాజమాన్యం దసరా అడ్వాన్స్​గా ఒక్కో కార్మికుడికి రూ.25 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. రాంచీలో జాతీయ కార్మిక సంఘాలు, కోలిండియా యాజమాన్యం మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పెర్​ఫార్మెన్స్ ​లింక్​డ్ రివార్డు(పీఎల్ఆర్- దీపావళి బోనస్) రూ.76,500 చొప్పున అందనుంది. 

బకాయిల మాఫీతో లాభాలు తగ్గాయి

సింగరేణి సంస్థకు ఏపీ జెన్కో నుంచి రావాల్సిన బకాయిలు రూ.1,600 కోట్లు సర్కార్​ మాఫీ చేయడం వల్ల లాభాలు తగ్గాయి. మాఫీ చేసిన మొత్తం కలిపితే ప్రతి కార్మికుడికి రూ.1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు దక్కేది. సింగరేణిలో రాష్ట్రసర్కార్ రాజకీయ​ జోక్యం, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్​ చేతకానితనం వల్ల కార్మికులు నష్టపోవాల్సి వచ్చింది. 

– వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ జనరల్​ సెక్రటరీ

రూ.368 కోట్లు అందించడం గొప్ప విషయం

ఈ ఏడాది అర్హులైన సింగరేణి కార్మికులకు రూ. 368 కోట్లు అందిస్తున్న సీఎం కేసీఆర్​కు ఉద్యోగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. కార్మికుల శ్రమ, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ మరింత ముందుకు సాగుతూ, దేశానికి వెలుగులు పంచుతుంది. 

– కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ, టీబీజీకేఎస్​ గౌరవ అధ్యక్షురాలు

లాభాలు తక్కువ చూపారు

సింగరేణి కంపెనీ గతయేడాది రూ. 26,607 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. సుమారుగా రూ. 1,600 కోట్ల లాభాలు వచ్చాయి. ఇందులో 35 శాతం వాటాగా కార్మికులకు రూ.580 కోట్లు అందాల్సి ఉంది. యాజమాన్యం లాభాల వాటాను పక్కదారి పట్టించి కేవలం నికర లాభాలు రూ.1,227 కోట్లు ప్రకటించి కార్మికులకు ఆర్థికంగా నష్టం చేస్తోంది. రాష్ట్ర సర్కార్​ రాజకీయ జోక్యంతో వాస్తవ లాభాలు తక్కువ చూపారు.

– యాదగిరి సత్తయ్య, బీఎంఎస్​ స్టేట్ ​ప్రెసిడెంట్​