న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు

న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా లద్నాపూర్​పై మరోసారి సింగరేణి తన ప్రతాపాన్ని చూపించింది. ఆర్అండ్ఆర్​ప్యాకేజీ కోసం 70 రోజులుగా గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత గ్రామంలోకి పోలీసులతో కలిసి వచ్చిన సింగరేణి యాజమాన్యం జేసీబీలతో ఇండ్లను కూల్చేసింది. గ్రామస్తులంతా కలిసి అడ్డుకోవడంతో దాదాపు100 మందిని అరెస్టు చేసి మంచిర్యాల జిల్లా జైపూర్​మండలంలోని పవర్​ప్లాంటుకు తరలించారు. దీంతో  నలుగురు యువకులు పురుగుల మందు డబ్బాలతో వాటర్​ట్యాంక్​ ఎక్కారు. ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో పెద్దపల్లి, సుల్తానాబాద్​, మంథని సర్కిల్స్​కు చెందిన పోలీసులు వచ్చారు. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి ట్యాంక్​ఎక్కిన వారిని కిందకు దించారు. మరోవైపు సమస్యను కలెక్టర్​దృష్టికి తీసుకువెళ్లడానికి గ్రామస్తులంతా కలిసి పెద్దపల్లి కలెక్టరేట్​కు వెళ్లారు. అక్కడ నిరసన తెలిపి మాట్లాడుతూ తమ భూములు, ఇండ్లు తీసుకొని నష్టపరిహారం ఇవ్వడం లేదన్నారు. ఇటీవల మంత్రి హరీశ్​రావు మంథని పర్యటన సందర్భంగా వినతిపత్రం ఇస్తే వారంలోనే సమస్య పరిష్కరిస్తానని మాట ఇచ్చారన్నారు. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు. మళ్లీ సోమవారం అర్ధరాత్రి సింగరేణి యాజమాన్యం పోలీసులను తీసుకువచ్చి ఇండ్లను కూల్చివేశారన్నారు. అధికారుల హామీతో నిరసన విరమిస్తున్నట్లు ప్రకటించారు. 

అరెస్టు అమానుషం

లద్నాపూర్​ గ్రామస్తులను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు. ఓసీపీల విస్తరణలో భాగంగా లద్నాపూర్​ గ్రామస్తుల భూములు, ఇండ్లు సింగరేణి తీసుకున్నది. కానీ, వారికి న్యాయమైన పరిహారం ఇవ్వలేదు. గ్రామస్తులంతా భూములు కోల్పోయి, ఉపాధి లేక రోడ్డున పడ్డారు. పునరావాసం చూపకుండా, రాత్రివేళల్లో పోలీసులను వెంటబెట్టుకొని వచ్చి జేసీబీలతో ఇండ్లు కూల్చివేయడాన్ని ఖండిస్తున్నా. వెంటనే ప్రభుత్వం స్పందించి సింగరేణి యాజమాన్యం ద్వారా లద్నాపూర్​ వాసులకు ఆర్అండ్ఆర్​ ప్యాకేజీ వర్తింపజేయాలి 
- డాక్టర్​ వివేక్​ వెంకటస్వామి, బీజేపీ జాతీయ కార్యవర్గం సభ్యులు