సింగరేణిపై వర్షం ఎఫెక్ట్

సింగరేణిపై వర్షం ఎఫెక్ట్
  • చిన్న పాటి వానకే బురదమయంగా మారుతున్న ఓపెన్ కాస్ట్ రోడ్లు
  • ముందుకు పడని బీటీ, సిమెంట్ రోడ్ల ప్రపోజల్స్
  • చివర్లో టార్గెట్ చేరుకునేందుకు ఆపసోపాలు పడుతున్న సంస్థ
  •  ఏటా రూ. వందల కోట్లు నష్టం

కోల్​బెల్ట్, వెలుగు: భారీ వర్షాలతో ప్రతి ఏటా సింగరేణికి కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ప్రస్తుతం ఉన్న మట్టి రోడ్లు చిన్నపాటి వానకే బురదమయంగా మారుతుండడంతో భారీ వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. వర్షం తగ్గిన తర్వాత బురదను తొలగించి తడి ఆరిన తర్వాతే బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ (మట్టి) వెలికితీత పనులు కొనసాగించాల్సిన పరిస్థితి. దీంతో సింగరేణి ఓపెన్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. శాశ్వత రోడ్లు వేస్తామని సీఎండీ ప్రకటించి ఏడాది గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం వర్షాలు స్టార్ట్ కావడంతో ఈ సంవత్సరం కూడా బొగ్గు ఉత్పత్తికి ఇబ్బందుుల తప్పేలా లేవు.

వర్షాకాలంలో సవాల్​గా మారనున్న ఉత్పత్తి

సింగరేణి వ్యాప్తంగా 19 ఓపెన్​కాస్ట్​గనులున్నాయి. అందుల్లో రోజుకు 1.7 లక్షల టన్నుల పైగా బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంది. 80 శాతం బొగ్గు ఉత్పత్తి ఓపెన్​కాస్ట్​ గనుల నుంచి వస్తుండగా అదే స్థాయిలో బొగ్గు రవాణా జరుగుతోంది. అయితే ప్రతి ఏటా వర్షాకాలంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా ఇబ్బందిగా మారింది. రోజుల తరబడి వర్షాలు పడితే రోడ్లన్నీ బురదమయంగా మారుతున్నాయి. దీంతో గనుల నుంచి వెలికి తీయడమే కాకుండా నిల్వ బొగ్గును కూడా రవాణా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. వర్షాల కారణంగా ఉత్పత్తి నిలిచిపోతుండడంతో టార్గెట్ ను చేరుకునేందుకు చివర్లో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గతేడాది జులైలో వరుసగా రెండు వారాల పాటు భారీ వర్షాలు పడ్డాయి. దీని వల్ల ఓసీపీల్లో భారీ యంత్రాలు నడవకపోవడంతో సుమారు 2 మిలియన్​టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. రోజుకు 1.7 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాల్సి ఉండగా ఒక్క టన్ను బొగ్గును బయటకు తీయలేకపోయారు. దీని వల్ల సింగరేణి సంస్థ సుమారు రూ.600 కోట్ల ఆదాయం కోల్పోయింది. 

కమిటీ రిపోర్టు రాలె.. శాశ్వత రోడ్లు నిర్మించలే..

గతేడాది రెండు వారాల పాటు వానలు పడడం, వందల కోట్ల ఆదాయానికి గండిపడడంతో ఓసీపీల్లోని క్వారీ రోడ్లు పటిష్ట పరచాలని గతేడాది జులైలో సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఇందులో భాగంగా సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్​ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ఏరియా ఆఫీసర్లకు తెలిపారు. భారీ వర్షాలు పడుతుండడంతో గనుల్లోని మట్టి స్వభావాన్ని బట్టి బీటీ లేదా సిమెంట్ తో రోడ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ ప్రాంతాన్ని తాత్కాలికంగా కంకర రాళ్లు, డస్ట్​తో చదును చేసి రాకపోకలకు అనువుగా మార్చుకోవాలని సీఎండీ దిశానిర్దేశనం చేశారు. ఎక్కడా వెహికల్స్, మిషనరీలు కూరుకుపోకుండా, రాకపోకలు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గనుల ప్రారంభం నుంచి బీటీ, సీసీ రోడ్లు నిర్మించడంతో పాటు పని ప్రదేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై అధ్యయనం కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నైవేలీలోని బొగ్గు గనుల్లో తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసి రిపోర్టు సమర్పించాలని సూచించారు. దీని ఆధారంగా సింగరేణి పరిధిలోని ఓసీపీ గనుల్లో తగిన చర్యలు చేపడుతామని సీఎండీ చెప్పారు. కమిటీ ఏర్పాటు చేసి ఏడాది గడిచినా ఇప్పటివరకు రిపోర్టు ఇవ్వలేదు.. రోడ్లు నిర్మంచలేదు. ప్రస్తుతం మళ్లీ వర్షాకాలం కావడంతో బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీతకు ఇబ్బందులు తప్పేలా లేవు.