- రేట్లు తగ్గించినా క్వాలిటీ లేదంటూ ఆసక్తి చూపని సంస్థలు
- కొత్త గనుల తవ్వకానికి రాని పర్యావరణ అనుమతులు
- 2026–27 లక్ష్యాన్ని భారీగా తగ్గించుకున్న సింగరేణి
హైదరాబాద్/కోల్‌బెల్ట్, వెలుగు : ఓ వైపు కొత్త గనులు రాకపోవడం, మరో వైపు ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ బొగ్గును కొనేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడం.. సింగరేణి ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. కొంతకాలంగా ప్రతి సంవత్సరం పది శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని పెంచుకుంటూ పోయిన సంస్థ... ఇటీవల ఎదురవుతున్న సవాళ్ల కారణంగా ఈ సంవత్సరం టార్గెట్‌ను తగ్గించుకుంది. గతేడాది 76 మిలియన్ టన్నుల టార్గెట్‌ను పెట్టుకోగా.. చివరకు 58 మిలియన్ టన్నుల ఉత్పత్తికే పరిమితమైంది. దీంతో 2026–27 సంవత్సరంలో ఉత్పత్తి లక్ష్యాన్ని 60 మిలియన్ టన్నులకే కుదించడం కార్మికవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
టార్గెట్ తగ్గించినా ఉత్పత్తి సాధ్యం కాలే...
సింగరేణి సంస్థ 2025 – 26 ఆర్థిక సంవత్సరంలో 76 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ సంవత్సరం కొత్త ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో పాటు ఇప్పటికే ఉన్న గనుల విస్తరణ కారణంగా ఎలాగైనా టార్గెట్ చేరుకోవచ్చని భావించింది. ఒడిశా రాష్ట్రంలో తొలిసారిగా తీసుకున్న నైనీ బొగ్గు బ్లాక్‌లో పది మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయాలని, దీంతో పాటు కొత్తగూడెంలోని వీకే కోల్‌మైన్స్, బెల్లంపల్లి ప్రాంతంలోని గోలేటి ఓసీపీ, ఇల్లెందులోని జేకే ఓసీపీ (రొంపేడు), బెల్లంపల్లి ప్రాంతంలోని ఎంవీకే ఓసీపీ గనుల నుంచి సైతం బొగ్గును వెలికి తీసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ ఈ గనుల తవ్వకానికి సంబంధించి అటవీ, పర్యావరణ అనుమతులు రాలేదు. నైనీ బొగ్గు టెండర్ల విషయంలో వివాదం తలెత్తడం, పరిస్థితులు అనుకూలించకపోవడంతో బొగ్గు పెళ్లను కూడా వెలికితీయలేదు. మరోవైపు రామగుండంలోని జీడీకే 5 కోల్‌మైన్స్‌లో ఏడాదికి 3 మిలియన్ టన్నులు, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం ఓసీపీ నుంచి 2.6 మిలియన్ టన్నులు, మందమర్రి ఏరియాలోని కేకే ఓసీపీ నుంచి 22.5 మిలియన్ టన్నులు, రామగుండంలోని మెగా ఓసీపీ ద్వారా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు 2023 – 24 నుంచి కాగితాలకే పరిమితం అవుతున్నాయి.
అండర్ గ్రౌండ్ మైన్లు వరుసగా మూత పడుతుండడం, శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల్లోని ఇందారం, కేకే ఓసీపీల్లో ఓబీ టెండర్ల వివాదంతో ఓవర్ బర్డెన్ తీయకపోవడం, అధిక వర్షపాతంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడం లాంటి కారణాలు ఉత్పత్తి లక్ష్యాలను దెబ్బతీశాయి. కానీ అదే సమయంలో సత్తుపల్లి, బెల్లంపల్లి ఏరియాల్లో వంద శాతం ఉత్పత్తి జరిగింది. అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ (ఏపీఏ) ఏరియాలో కేవలం 11 శాతం ఉత్పత్తి మాత్రమే జరగడం గమనార్హం. ఇలాంటి అనేక ప్రతికూల పరిస్థితుల వల్ల గతేడాది ఉత్పత్తి టార్గెట్‌ను చివరి నెలల్లో 60 మిలియన్ టన్నులకు కుదించారు. అయినప్పటికీ లక్ష్యం చేరుకోక చివరకు 58 మిలియన్ టన్నుల ఉత్పత్తికే పరిమితమైంది.
రేట్లు ఎక్కువగా ఉండడంతో సింగరేణి బొగ్గుకు తగ్గుతున్న డిమాండ్
సింగరేణిలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో 80 శాతాన్ని థర్మల్ పవర్ కేంద్రాలే కొనుగోలు చేస్తున్నాయి. తెలంగాణ జెన్‌కో, ఎన్టీపీసీ, ఆంధ్ర జెన్‌కో, కేపీసీఎల్, మహారాష్ట్ర జెన్‌కో, తమిళనాడు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఈ బొగ్గును కొంటున్నాయి. వీటితో పాటు ప్రతీ సంవత్సరం సుమారు 10 మిలియన్ టన్నుల బొగ్గును సిమెంట్, స్పాంజ్, ఐరన్, సిరామిక్, ఫార్మా కంపెనీలు సైతం కొనుగోలు చేస్తున్నాయి. సింగరేణి బొగ్గు గ్రేడ్‌ను బట్టి టన్నుకు రూ.2,910 నుంచి రూ.6,200కు అమ్ముతుంటే.. ఇదే గ్రేడ్ బొగ్గు కోల్ ఇండియాలో రూ.1,120 నుంచి రూ.3,560 లోపే లభిస్తోంది. పవర్ సెక్టార్‌కు సంబంధించిన బొగ్గును సింగరేణి టన్నుకు రూ.3,400 నుంచి రూ.5,200 చొప్పున అమ్ముతుండగా.. రవాణా చార్జీలు కలిపితే రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పైగా అవుతోంది.
ఇదే సమయంలో కోల్ ఇండియాలో అయితే ఇదే రకమైన బొగ్గు రవాణా చార్జీలతో కలిపి రూ.4 వేల లోపే వస్తోంది. కోల్ ఇండియా, విదేశీ బొగ్గు ధరలతో పోలిస్తే సింగరేణి బొగ్గు ధర మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందంటూ పలు థర్మల్ విద్యుత్ కేంద్రాలు సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. మరో వైపు సింగరేణిలో ఉత్పత్తి అయ్యే గ్రేడ్14, 15, 16 రకాల బొగ్గులో క్వాలిటీ లేదంటూ కొనుగోలుకు ఎన్టీపీసీ, ఏపీ జెన్‌కో, కర్నాటక విద్యుత్ కేంద్రాలు అభ్యంతరం చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కువగా సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్లు ఉండటం, అవి గ్రేడ్ 14, 15 బొగ్గును తీసుకునేందుకు నిరాకరిస్తుండం సింగరేణి ఉత్పత్తి తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. సింగరేణి బొగ్గు ధరలు తగ్గంచాలని పలు సంస్థలు కేంద్రాన్ని కోరడంతో బేసిక్ ప్రైస్‌లో రూ.650 తగ్గించారు. అయినా ఇంకా తగ్గించాలని ఆయా సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. బయట దొరికే బొగ్గును కొంటే ప్రతి నెలా రూ. వందల కోట్లు మిగులుతుండడంతో.. సింగరేణి బొగ్గుకి డిమాండ్ తగ్గిపోయిందని ఎక్స్పర్ట్స్చెప్తున్నారు.
