రామగుండం కోల్ మైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పర్యావరణ అనుమతులు..314మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం

రామగుండం కోల్ మైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పర్యావరణ అనుమతులు..314మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం
  • 2 ఓసీ గనులు, 3 భూగర్భగనుల తవ్వకం కోసం ప్రాజెక్టు 
  • భూగర్భ బొగ్గు నిల్వల గరిష్ట వినియోగం కోసం వినూత్న ప్రణాళిక 
  • 314.98 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వల సద్వినియోగమే లక్ష్యం 
  • ఏడాదికి 21 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి 
  • 25 ఏండ్లపాటు కొనసాగనున్న బొగ్గు తవ్వకాలు..రామగుండం రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొత్త ఊపిరి

హైదరాబాద్, వెలుగు:సింగరేణి సంస్థ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రామగుండం కోల్ మైన్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అనుమతులు వచ్చాయి. ఈ మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ నుంచి సింగరేణి యాజమాన్యానికి సమాచారం వచ్చింది.  మరో 10 రోజుల్లో అనుమతి పత్రాలు అందనున్నాయి. 2 ఓసీ గనులు, 3 భూగర్భ గనుల తవ్వకాల కోసం చేపట్టిన విశిష్ట ప్రాజెక్ట్​ ఇది. 

సింగరేణి చరిత్రలోనే అత్యధికంగా ఏడాదికి 21 మిలియన్​ టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యంతో రూపొందించిన ఈ వినూత్న ప్రాజెక్టుకు ప్రాథమిక పర్యావరణ అనుమతులు లభించడం పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 314.98 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వి తీయడమే ఈ ప్రాజెక్ట్​ లక్ష్యం.  25 ఏండ్లపాటు బొగ్గు తవ్వకాలు కొనసాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతులు రావడంతో రామగుండం రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కొత్త ఊపిరి లభించినట్లయింది.

314 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు

మూతపడుతున్న పాత గనుల ఉత్పత్తిని భర్తీ చేయడానికి, 2 ఓపెన్ కాస్ట్ గనులు, 3 భూగర్భ గనుల పరిధిలోని బొగ్గును ఇంకా తవ్వి తీయటానికి అనువుగా మొత్తం 314.98 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఈ ప్రాజెక్టును రూపొందించారు. ‘‘మూతపడిన జీడీకే-10 ఇంక్లైన్, మూతపడనున్న వకీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చడం.. ఈ గనులకు ఆనుకొని ఉన్న రామగుండం ఓపెన్ కాస్ట్-–1 విస్తరణ ప్రాజెక్టు ఫేజ్– 2, రామగుండం ఓపెన్ కాస్ట్-–2 విస్తరణ ప్రాజెక్టు, అడ్రియాల షాఫ్ట్ అండర్ గ్రౌండ్ విస్తరణ ప్రాజెక్టుల అంచులలో మిగిలిన బొగ్గును గరిష్టంగా వెలికి తీయడం.. వీటన్నింటినీ కలిపి రామగుండం కోల్ మైన్ అనే ఒక విశిష్ట ప్రాజెక్టు’’ కు సింగరేణి కంపెనీ రూపకల్పన చేసింది. ఇక్కడ ఉత్పత్తి చేసే బొగ్గు ప్రధానంగా దగ్గరలో ఉన్న ఎన్టీపీసీ రామగుండం,  ఇతర బొగ్గు ఆధారిత పరిశ్రమలకు ఇంధన సరఫరా ఒప్పందం ప్రకారం సరఫరా చేయనున్నారు.  

తక్కువ పెట్టుబడితో బొగ్గు ఉత్పత్తి..

ఈ ప్రాజెక్ట్​ కింద ఓపెన్ కాస్ట్ గనుల ప్రాంతం నుంచి 182.28 మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నులు, భూగర్భ గనుల ప్రాంతం నుంచి 132.70 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉత్పత్తి చేయనున్నారు. ఇక్కడ సగటు బొగ్గు గ్రేడు జీ-10 గా గుర్తించారు.  ఇప్పటికే ఉన్న అనుమతులను సద్వినియోగం చేస్తూ తక్కువ పెట్టుబడులతో, పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బొగ్గు ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును​ రూపొందించారు. 

ఈ గని రామగుండం రీజియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మరో 25 ఏండ్ల జీవిత కాలాన్ని అందించనున్నది. సాధారణంగా భూగర్భంలో బొగ్గు తవ్వకం అయిపోయిన తర్వాత కూడా గనిలో కొంతమేర బొగ్గు మిగిలిపోతుంది. ప్రకృతి వరప్రసాదమైన బొగ్గును ఈ విధంగా వదిలివేయకుండా సద్వినియోగం చేసుకోవడం కోసం సింగరేణి సంస్థ గతంలో మూతపడిన భూగర్భ గనుల ప్రదేశంలో ఓపెన్ కాస్ట్ గనులను ప్రతిపాదించి అనుమతులు సాధించింది. బొగ్గు తవ్వకాలు విజయవంతంగా నిర్వహించింది. వీటిలో కొత్తగూడెంలోని గౌతమ్ ఖని ఓపెన్ కాస్ట్ గని, మణుగూరులో మణుగూరు ఓపెన్ కాస్టు గని,  మరికొన్ని ఓసీ గనులతోపాటు తాజాగా కొత్తగూడెంలోని వీకే కోల్ మైన్లు ఉన్నాయి.  

25 ఏండ్లపాటు కొనసాగనున్న బొగ్గు తవ్వకాలు 

రామగుండం కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైన్​ ప్రాజెక్టులో సుమారు 25 ఏండ్లపాటు బొగ్గు తవ్వకాలు జరగనున్నాయి. ముందుగా మూతపడిన జీడికే-10 ఇంక్లైన్ భూగర్భ గనిని ఓపెన్ కాస్ట్ గనిగా మారుస్తారు. దీనిని ఓపెన్ కాస్ట్-1 గనిని ముందుకు కొనసాగిస్తూ షావెల్- డంపర్ పద్ధతిలో తవ్వుతూ వెళ్తారు. ఈ క్రమంలో వచ్చే ఓవర్ బర్డెన్ మట్టిని ప్రస్తుతం ఆర్.జి ఓసీ-1 ఎక్స్ టెన్షన్ ఫేజ్–-2 లో బొగ్గు తవ్వగా ఏర్పడిన ఖాళీ ప్రదేశంలో నింపుతూ వస్తారు. ఇలా జీడీకే-10 ఇంక్లైన్ ప్రాంతంలోని బొగ్గు తవ్వకానికి  8 ఏండ్ల సమయం పడుతుంది. 

ఆ తర్వాత వకీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి గనిని ఓపెన్ కాస్ట్ గనిగా మారుస్తారు. ఈ క్రమంలో వకీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి ఓపెన్ కాస్ట్ గని ప్రాంతం నుంచి వచ్చే ఓవర్ బర్డెన్ మట్టిని అప్పటికే తవ్వకం పూర్తయిన జీడీకే-10 ఇంక్లైన్  క్వారీలో ఏర్పడే ఖాళీ ప్రదేశంలో నింపుతారు. ఈ విధంగా రెండు భూగర్భ గనులను ఓపెన్ కాస్ట్ గనులుగా మార్చినప్పటికీ ఆ క్వారీల్లో అక్కడ ఉత్పత్తి జరిగే ఓవర్ బర్డెన్ మట్టితోనే నింపుతారు.  సింగరేణి కార్మికులు దీనిని ఒక భారీ పర్యావరణహిత చర్యగా పేర్కొంటున్నారు. అలాగే, రామగుండం కోల్ మైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ఉన్న ఇతర ఓపెన్ కాస్ట్ గనుల బొగ్గు తవ్వకాలను కొనసాగిస్తారు. ఈ మొత్తం బొగ్గు తవ్వకాన్ని లాంగ్ వాల్, కంటిన్యూయస్ మైనర్, బోర్డర్ మైనర్స్, రోడ్డు హెడర్స్ ద్వారా అలాగే షావెల్-డంపర్ ప్రక్రియలో నిర్వహిస్తారు. 

ఎన్టీపీసీతో కొనసాగనున్న సింగరేణి అనుబంధం

రామగుండం కోల్​మైన్​ ప్రాజెక్ట్​ రాకతో ఇక్కడ ఎన్టీపీసీతో సింగరేణి అనుబంధం కొనసాగనున్నది. రామగుండంలోని ఎన్టీపీసీకి సింగరేణి సంస్థ దశాబ్దాల కాలంగా బొగ్గు సరఫరా చేస్తూ వస్తున్నది. సింగరేణికి ఉన్న అతి పెద్ద వినియోగదారు ఎన్టీపీసీ. గత కొంత కాలంగా పాత  గనులు  మూతపడుతున్న నేపథ్యంలో తగినంత బొగ్గును ఎన్టీపీసీ కి అందించలేని పరిస్థితి ఉండేది. అయితే, ఇప్పుడు కొత్త ప్రాజెక్టుకు అనుమతి రావడంతో ఎన్టీపీసీతో సింగరేణి వ్యాపార బంధం ఎలాంటి అవాంతరాలు లేకుండా మరో 25 ఏండ్ల పాటు కొనసాగనున్నది. సింగరేణికి ఈ కొత్త ప్రాజెక్టు  ఒక వరప్రదాయనిగా సింగరేణి కార్మికులు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 5,403 మంది సింగరేణి ఉద్యోగులు, మరో 600 మంది కాంట్రాక్టు సిబ్బంది పని చేయనున్నారు. మొత్తం రూ.2,194.05 కోట్ల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.