బొగ్గు లోడింగ్ పూర్తయ్యే దాకా వ్యాగన్లతోనే ఇంజన్

బొగ్గు లోడింగ్ పూర్తయ్యే దాకా వ్యాగన్లతోనే ఇంజన్

రైల్వే శాఖతో సింగరేణి ఒప్పందం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఈ ఏడాది బొగ్గు రవాణా భారీ ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ దక్షిణ మధ్య రైల్వేతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ‘ఇంజన్ ఆన్ లోడ్’ అనే ఒప్పంద పత్రాలపై శుక్రవారం సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌లోని రైల్ నిలయంలో రైల్వే శాఖ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ కె.శివప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్, సింగరేణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె.అల్విన్‌‌‌‌‌‌‌‌ సంతకాలు చేశారు.

సింగరేణిలోని ఐదు ప్రధాన బొగ్గు లోడింగ్ ప్రాంతాలైన రామగుండం, ఆసిఫాబాద్, కొత్తగూడెం, మణుగూరు సీహెచ్‌‌‌‌‌‌‌‌పీలకు సంబంధించి ఈ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం బొగ్గు లోడింగ్‌‌‌‌‌‌‌‌కు వ్యాగన్లను తీసుకొచ్చిన ఇంజన్.. లోడింగ్ పూర్తయ్యే వరకూ అక్కడే ఉంటుంది. పూర్తయిన వెంటనే వాటిని తీసుకొని నిర్దేశిత అన్ లోడింగ్ ప్రదేశానికి వెళ్తుంది. గతంలో కోల్‌‌‌‌‌‌‌‌ హ్యాండ్లింగ్‌‌‌‌‌‌‌‌ పాయింట్‌‌‌‌‌‌‌‌ వద్ద వ్యాగన్లను లోడింగ్‌‌‌‌‌‌‌‌కు ఉంచి, ఇంజన్లు వెళ్తుండేవి. తిరిగి లోడింగ్ పూర్తయిన తర్వాత వచ్చి తీసుకెళ్తుండేవి. అయితే దీని వల్ల లోడింగ్ పూర్తయినా ఒక్కోసారి ర్యాకులు ఇంజన్ కోసం ఎదురుచూడాల్సి వస్తుండేది. లేదా బొగ్గు లోడింగ్ ఆలస్యమై ఇంజన్ కూడా వేచి ఉండాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని నివారించడం కోసం వేగంగా లోడింగ్ జరిపి బొగ్గు రవాణా చేసేందుకు తాజా ఒప్పందం కుదుర్చుకున్నారు.