సింగరేణిలో కార్మికుల మొదటిరోజు సమ్మె

సింగరేణిలో కార్మికుల మొదటిరోజు సమ్మె

సింగరేణిలో కార్మిక సంఘాలు గురువారం చేసిన సమ్మె విజయవంతం అయింది. కంపెనీ సర్వే చేసిన నాలుగు కోల్ బ్లాక్​లను ప్రైవేటైజేషన్​లో భాగంగా వేలం వేయాలని కేంద్రం నిర్ణయించడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మెతో సింగరేణిలోని  29 అండర్ గ్రౌండ్ మైన్స్, 19 ఓపెన్​కాస్ట్ లలో బొగ్గు తవ్వుడు పూర్తిగా ఆగిపోయి.. ఒక్క పెల్ల కూడా బయటికి రాలేదు. దీంతో దాదాపు రూ.60 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తిపై దెబ్బ పడింది. కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​ను కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, కార్మికులు ముట్టడించారు. 

భద్రాద్రికొత్తగూడెం, మందమర్రి, గోదావరిఖని, వెలుగు: సింగరేణి కాలరీస్​ కంపెనీలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం సమ్మె జరిగింది. సింగరేణి సర్వే చేసిన నాలుగు కోల్​బ్లాక్​లైన భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం ఓసీ –3, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి జేవీఆర్​ఓసీ, మందమర్రి ఏరియాలోని కళ్యాణఖని, శ్రావణపల్లి ఓసీ కోల్​ బ్లాక్​లను ప్రైవేటైజేషన్​లో భాగంగా వేలం వేయాలన్న కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు గురు, శుక్ర, శనివారాల్లో సమ్మెకు పిలుపునిచ్చారు. సింగరేణి గుర్తింపు సంఘమైన టీబీజీకేఎస్ తో పాటు సింగరేణి కాలరీస్​ వర్కర్స్​యూనియన్(ఏఐటీయూసీ), సింగరేణి కోల్​ మైన్స్​కార్మిక సంఘ్​(బీఎంఎస్​), సీఐటీయూ, ఐఎన్​టీయూసీ, హెచ్​ఎమ్మెస్​, ఇఫ్టూ సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. సమ్మెతో సింగరేణిలోని 29 అండర్​ గ్రౌండ్​ మైన్స్, 19 ఓపెన్​కాస్ట్​ మైన్స్​లో కోల్ ​ప్రొడక్షన్​స్తంభించింది.

కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి, శ్రీరాంపూర్, ఆర్జీ –  1,2,3 ఏరియాల్లో బొగ్గు పెల్ల బయటికి రాలేదు. సమ్మెతో దాదాపు రూ. 60 కోట్ల విలువైన కోల్​ ప్రొడక్షన్​కు విఘాతం కలిగింది. మొదటి షిఫ్ట్​లో సింగరేణి వ్యాప్తంగా 27,559 మందికిగానూ 3,420 మంది వర్కర్స్​ అటెండ్​ అయ్యారు. ఇందులో 90 శాతం మంది ఎసెన్షియల్​ స్టాఫే ఉన్నారు. ఇదిలా ఉండగా సింగరేణిలోని ఓపెన్​కాస్ట్​ మైన్స్​లలో ఓవర్​బర్డెన్​ పనులు కొనసాగాయి. ఓవర్​ బర్డెన్​ పనులు చేసే కాంట్రాక్టర్లు అత్యధిక శాతం టీఆర్ఎస్​, టీబీజీకేఎస్​ నాయకుల కనుసన్నలలోనే పనిచేస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు.  సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్​ వర్కర్స్​ మొదటి షిఫ్ట్​లో 11,727 మందికి 5,792 మంది అటెండ్​ అయ్యారు. 
కొత్తగూడెంలో ఉద్రిక్తత
కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​ను కార్మిక సంఘాల జేఏసీ నాయకులు, కార్మికులు ముట్టడించారు. ఈ సందర్భంగా హెడ్డాఫీస్​లోకి ఆఫీసర్లు, ఉద్యోగులు పోకుండా అడ్డుకున్నారు. మీ కాళ్లు పట్టుకుంటాం, డ్యూటీలోకి వెళ్లవద్దు, సమ్మెకు మద్దతు ఇవ్వండి అంటూ నాయకులు, కార్మికులు హెడ్డాఫీస్​ ఆఫీసర్లు, ఉద్యోగులను వేడుకున్నారు. మొండిగా వెళ్లేవారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. కొందరు ఉద్యోగులు, కాంట్రాక్ట్​ వర్కర్స్​కాంపౌండ్​వాల్​దూకి దొంగచాటుగా హెడ్డాఫీస్​లోకి పోవడం పట్ల కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం మినహాయిస్తే గత రెండు దశాబ్దాల కాలంలో హెడ్డాఫీస్​లోకి మధ్యాహ్నం వరకు డ్యూటీలకు వెళ్లకుండా అడ్డుకున్న ఘటన ఇదే కావడం గమనార్హం. సింగరేణి వ్యాప్తంగా ఓపెన్​కాస్ట్​లు, అండర్​గ్రౌండ్​ మైన్స్​లతో పాటు జీఎం ఆఫీస్​ల ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. 

నిరవధిక సమ్మె చేస్తాం
సింగరేణికి చెందిన  నాలుగు కోల్​ బ్లాక్​లను సింగరేణికే కేటాయించేంతవరకు అవసరమైతే కంపెనీలో నిరవధిక సమ్మె చేస్తామని కార్మిక సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకులు స్పష్టం చేశారు. కొత్తగూడెం ఏరియా జీఎం ఆఫీస్​, సింగరేణి హెడ్డాఫీస్​ ఎదుట గురువారం చేపట్టిన ధర్నాలో వర్కర్స్​ యూనియన్​ గౌరవ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, యూనియన్​సెంట్రల్​ఆర్గనైజింగ్​ సెక్రెటరీ వంగా వెంకట్, సీఐటీయూ స్టేట్ ​జనరల్​ సెక్రెటరీ ఎం. సాయిబాబు, ఎంప్లాయీస్​ యూనియన్​ స్టేట్​జనరల్ సెక్రెటరీ మందా నర్సింహారావు, కోల్​మైన్స్​కార్మిక సంఘ్​స్టేట్​జనరల్​ సెక్రెటరీ పి. మాధవ్, టీబీజీకేఎస్​ వైస్​ ప్రెసిడెంట్​ఎండి. రజాక్, హెచ్​ఎమ్మెస్, ఇఫ్టూ నాయకులు రమణారావు, డి. ప్రసాద్​, సంజీవ్​ మాట్లాడారు. నాలుగు కోల్​ బ్లాక్​లను వేలం వేయడాన్ని  కేంద్రం విరమించుకోకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లాభాల బాటలో నడుస్తున్న కంపెనీలను ప్రైవేటైజేషన్​చేసే కుట్రలను ఎండగట్టాలన్నారు. కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం, కంపెనీ సీఎండీకి సరైన సఖ్యత లేకపోవడం వల్లే కోల్​బ్లాక్​లను వేలం వేసే పరిస్థితి వచ్చిందన్నారు.