నల్ల నేలలో ఎన్నికల శంఖారావం!

నల్ల నేలలో ఎన్నికల శంఖారావం!

రాష్ట్రంలో నియంత పాలనకు బుద్ధి చెప్పిన నల్ల నేలలో ఈ నెల 27న సింగరేణి యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు కూడా వెల్లడవుతాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సింగరేణి యూనియన్ ఎన్నికల్లోనూ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ కలిసి పోటీ చేయడానికి చర్చలు జరిగాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి,  శ్రీధర్ బాబు, సీపీఐ శాసన సభా పక్ష నేత కూనంనేని సాంబశివరావుల సమక్షంలో యూనియన్ నేతలు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్ ప్రసాద్ తదితరులు చర్చలు జరిపారు.

ఈ ఎన్నికలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో జరుగుతున్నాయి.13 యూనియన్లు  ఎన్నికల బరిలో ఉన్నా ప్రధాన పోటీ ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎమ్మెస్​ల మధ్యనే ఉంటుంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల మీద పెద్దగా ఆసక్తి చూపడం లేదు. యూనియన్ ఎన్నికలు యూనియన్ ఎన్నికల మాదిరే ఉండాలి అనేవిధంగా  కాంగ్రెస్​ ప్రభుత్వం ఉన్నది. అయితే రాజకీయ జోక్యం అవసరం లేదు అనే పరిస్థితి ఉండడం మంచి పరిణామంగా 
పేర్కొనవచ్చు. యూనియన్ నేతల నీతి, నిజాయతీ మీద ఈ ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇప్పటికే కార్మికులు తమ ఓటు ఎటు అనే విషయం మీద డిసైడ్ అయిపోయారు. గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆత్మాభిమానమే మెండుగా తెలంగాణలోని నల్ల నేల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటైంది. 11 అసెంబ్లీ స్థానాల్లో 8 కాంగ్రెస్, ఒకటి సీపీఐ గెలుచుకున్నది. మాకు ఆత్మాభిమానమే ముఖ్యం అంటూ తీర్పు ఇచ్చింది నల్ల నేల.

బీఆర్​ఎస్​ను మట్టికరిపించిన కార్మికులు

 మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, రామగుండం, మంథని, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, పినపాక తదితర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను బొగ్గు గని కార్మికులు మట్టి కరిపించారు. ఇప్పుడు యూనియన్ ఎన్నికల్లోనూ  కార్మికుల తీర్పు అలాగే ఉండబోతుంది.  రెండుసార్లు గుర్తింపు యూనియన్​గా ఉన్న బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్​ను కార్మికులు మట్టి కరిపించనున్నారు. కార్మిక వర్గం అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీని  నేల కింద వేసి తొక్కేసింది. అహంకారాన్ని ఓడించి ప్రశ్నించేటోడు విజయం సాధించాడు. కొంతమంది బీఆర్ఎస్, టీబీజీకేఎస్​ను  గుడ్డిగా నమ్మి బోర్లా పడ్డారు. నియంత ప్రభుత్వానికి కార్మికులు బుద్ధి చెప్పారు. తెలంగాణలోని గోదావరి తీరమంతా బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. 

మరో150 ఏండ్లు తవ్వి తీసినా తరగని నల్ల బంగారం ఉంది. 10 వేల మిలియన్ టన్నులు బొగ్గు తవ్వి తీయాలి. 135 సంవత్సరాల చరిత్ర సింగరేణికి ఉంది. సింగరేణి దేశంలోనే మొట్ట మొదటి ప్రభుత్వ రంగ సంస్థ. కేంద్రానికి 49శాతం, రాష్ట్రానికి 51శాతం భాగస్వామ్యంతో సంస్థ ఉంది.  సీఎండీ నియామకం మొదలు అడ్మినిస్ట్రేషన్ అంతా రాష్ట్రానిదే. తొమ్మిది ఏండ్లు దాటినా ఇంకా ఒకే ఐఏఎస్ అధికారి దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని సింగరేణికి సీఎండీగా నడిమెట్ల శ్రీధర్ కొనసాగుతున్నారు. ఈయనపై వినిపిస్తున్న అవినీతి, అక్రమాల ఆరోపణలపై విచారణ చేయాల్సిన అవసరం ఉంది.  ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి సీఎండీ శ్రీధర్ మీద ఉన్న అవినీతి ఆరోపణలపైన గతంలో వాకబు చేసినట్లు నాకు గుర్తు. 

సింగరేణికి కాకా చేయూత

 మాజీ కేంద్ర మంత్రి కాకా గడ్డం వెంకట స్వామి చేయూతతో సింగరేణికి1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ తెచ్చారు. ఎంపీ వివేక్ వెంకటస్వామి హయాంలో శంకుస్థాపన జరిగింది. సింగరేణి  సంస్థకు లాభాలు పుష్కలంగా వస్తున్నాయి. కానీ, సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన భారీ బకాయిల కారణంగా సింగరేణి పేపర్ రిచ్ గా రికార్డుల్లో ఉంది తప్ప క్యాష్ రిచ్​గా లేదు. గతంలో రెండుసార్లు నష్టాల్లోకి తోయబడి బయటపడింది. కేంద్రం నుంచి రూ.1100 కోట్ల అప్పును మాజీ కేంద్ర మంత్రి కాకా గడ్డం వెంకట స్వామి ఇప్పించారు. 

దీనికి వడ్డీని  పది ఏండ్ల మారిటోరియం అనంతరం 663 కోట్లు సింగరేణి వాయిదాల రూపంలో చెల్లించడం జరిగింది.  ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులను ఆదుకుని వారికి ఉద్యోగాలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలి.  కార్మికుల సంఖ్య ఇప్పుడు 39వేలకు పడిపోయింది. ఔట్ సోర్సింగ్ భారీగా పెరిగింది. స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి తన నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలకు కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యేగా ఎంపిక అయిన గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. వివేక్ చేసిన కృషి మేరకు జైపూర్ సింగరేణి పవర్ ప్లాంట్​తో పాటు, ఓపెన్ కాస్ట్ గనుల్లో కాంట్రాక్టు,  ఔట్ సోర్స్ ఉద్యోగాల్లో 80 శాతం స్థానికులను భర్తీ చేయడానికి సింగరేణి అంగీకరించింది. 

ఆ మేరకు డైరెక్టర్ ఫైనాన్స్, పర్సనల్ ఒక లిఖిత పూర్వక ఆదేశం ఇస్తూ సర్క్యులర్​ కూడా జారీ చేశారు. దీని వల్ల స్థానికులకు సింగరేణి వ్యాప్తంగా ప్రయోజనం కలిగే పరిస్థితి ఉంది.  బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మంచిర్యాల ఎమ్మెల్యే  ప్రేమ్ సాగర్ రావ్,  మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఇందుకు కృషి చేయాలి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది. నల్ల నేల బాగుపడుతుంది అని ఆశిద్దాం.

 ఎండి మునీర్, సీనియర్ జర్నలిస్ట్

  • Beta
Beta feature
  • Beta
Beta feature