కార్మికులే కీలకం..భూపాపల్లి మున్సిపాలిటీలో సింగరేణి కార్మికుల ఓట్లే అధికం

కార్మికులే కీలకం..భూపాపల్లి మున్సిపాలిటీలో సింగరేణి కార్మికుల ఓట్లే అధికం
  • 30 వార్డుల పరిధిలో 52,726 ఓటర్లు
  • కార్మికుల ఓట్లు 18వేలకు పైనే..
  • వారి ఓట్లపైనే ప్రధాన పార్టీల ఫోకస్​

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు:  భూపాలపల్లి పురపాలక పోరులో సింగరేణి కార్మికుల ఓట్లే కీలకం కానున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో  కార్మికులవే 18వేల ఓట్లు ఉండగా, పలు వార్డుల్లో సింగరేణి కార్మికులు గెలుపు, ఓటములను ప్రభావితం చేయనున్నారు. దీంతో ప్రధాన పార్టీలు కార్మికుల ఓట్లను గంప గుత్తగా పొందడంపై ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగానే ఆయా పార్టీల నాయకులు వ్యూహ రచనలు చేస్తున్నారు. కార్మిక సంఘం నాయకులతో టచ్​లో ఉంటూ మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  

కార్మికుల ఓట్లే అధికం..

భూపాలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలో మొgత్తం 30 వార్డుల పరిధిలో 52,726 మంది ఓటర్లు ఉండగా, ఇందులో సింగరేణి, కాంట్రాక్ట్, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబాలకు చెందిన ఓట్లు 18 వేలకు పైనే ఉన్నాయి. ప్రధానంగా మిలీనియం, టీ2, 1000 క్వాటర్స్, సుభాష్​ కాలనీ, కృష్ణకాలనీ, వెంగల్​రావు వెంచర్లలో అధికంగా కార్మికులు ఉన్నారు.

ఈ కాలనీల పరిధిలోని వార్డుల్లోని కార్మికులే గెలుపోటములు డిసైడ్​చేయనున్నారు. దీంతో భూపాలపల్లి మున్సిపాలిటీలో విజయం సాధించేందుకు పొలిటికల్​ పార్టీలు వ్యూహాలు రచిస్తూ ఇప్పటికే సింగరేణి కార్మికులను ప్రసన్నం చేసుకుంటున్నాయి. రోజుకోసారి కార్మికులను కలిసి మద్దతు ఇవ్వాలంటూ కోరుతున్నారు.  

కార్మిక సంఘాల నేతలతో మంతనాలు..

సీపీఐ అనుబంధ సంఘమైన ఏఐటీయూసీ సింగరేణి గుర్తింపు సంఘంగా ఉండగా, భూపాలపల్లి ఏరియాలో మాత్రం కాంగ్రెస్​ అనుబంధ ఐఎన్​టీయూసీ ప్రాతినిధ్య సంఘంగా కొనసాగుతోంది. దీనిని తమకు అవకాశంగా మలుచుకునేందుకు కాంగ్రెస్​ ముందస్తు వ్యూహంలో భాగంగానే వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతోంది. బీఆర్ఎస్​ ముఖ్యనేతలు కూడా కార్మిక సంఘం నాయకులతో టచ్ లోకి వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో మద్దతు కోసం మంతనాలు జరుపుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో కార్మికులు ఏ పార్టీవైపు నిలబడుతారనే ఆసక్తి నెలకొన్నది.  

పోటీ రసవత్తరం..

మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోరు రసవత్తరంగా ఉండనున్నది. కాంగ్రెస్​ పార్టీ వామపక్ష పార్టీలతో కలిసి బరిలోకి దిగుతోంది. కాంగ్రెస్ 24 వార్డుల్లో పోటీ చేస్తుండగా, సీపీఐ 5 వార్డుల్లో, సీపీఎం ఒక వార్డులో బరిలోకి దిగనున్నాయి. 30 వార్డుల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుండగా, బీజేపీ 24 వార్డుల్లో పోటీ చేసేందుకు రెడీ అయ్యింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్​కు ముందు నుంచే పట్టణంలో కాంగ్రెస్​ ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసింది.

ఆ పార్టీ స్థానిక నాయకత్వం ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ప్లాన్ చేసింది. బీఆర్ఎస్​ ఈ సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రజల్లో మంచి పేరున్న నేతలను రంగంలోకి దింపారు. బీజేపీ ఉనికి కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది.