‘చిన్మయికి పిల్లలు పుట్టొద్దు.. పుట్టినా చనిపోవాలి’..గ్రూప్ వాయిస్ కాల్స్లో యువకుల దూషణ

‘చిన్మయికి పిల్లలు పుట్టొద్దు.. పుట్టినా చనిపోవాలి’..గ్రూప్ వాయిస్ కాల్స్లో యువకుల దూషణ
  • పిల్లలు కనే రైట్ లేదంటూ అసభ్య పదజాలం 
  • ఎక్స్ లో హైదరాబాద్ సీపీకి  సింగర్ చిన్మయి కంప్లయింట్

బషీర్​బాగ్, వెలుగు: సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరిగిపోతున్నాయని ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం అవమానాలతో విసిగిపోయామని, మహిళలకు గౌరవం దక్కడం లేదని ఆందోళన చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఎక్స్ స్పేస్ లో కొందరు యువకులు మెన్ ఫెమినిస్ట్ పేరుతో గ్రూప్ వాయిస్ కాల్స్ మాట్లాడుతూ... సింగర్ చిన్మయితోపాటు మరికొంత మంది మహిళలను టార్గెట్ చేస్తూ లైవ్​లో దూషణలకు దిగారు.

 వీరికి పిల్లలు పుట్టకూడదని, ఒకవేళ పుట్టినా చనిపోవాలని.. వీళ్లకు పిల్లలు కనే రైట్ లేదంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఈ సంభాషణను చిన్మయి హైదరాబాద్ ​సీపీ సజ్జనార్​కు ఎక్స్​లో ట్యాగ్ చేశారు.  ఇలాంటి వారితో సమాజంలో మహిళలకు భద్రత కరువైందని తెలిపింది. అభంశుభం తెలియని పిల్లలు చనిపోవాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

  ఇలాంటి వారిపై కేసు నమోదు చేయాలని, కేసు 15 ఏండ్లు నడిచినా ఫర్వాలేదని, తాను పోరాడుతానని  స్పష్టంచేశారు.  ఆమె ట్విట్ కు రెస్పాండైన సీపీ చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించారు. అయితే గురువారం చిన్మయి  బషీర్ బాగ్ లోని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అందజేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు ఏసీపీ శివమారుతి  తెలిపారు.