మానవ అక్రమ రవాణా కేసులో దలేర్ మెహందీకి ఊరట

మానవ అక్రమ రవాణా కేసులో దలేర్ మెహందీకి ఊరట

పంజాబీ సింగర్ దలేర్ మెహందీకి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2003 నాటి మానవ అక్రమ రవాణా కేసులో ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ పాటియాలాలోని ఓ కోర్టు జులై 14న  ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. 

కేసు ఏంటి ? 

1998, 1999 సంవత్సరాలలో దలేర్ మెహందీ, ఆయన సోదరుడు షంషేర్ సింగ్  కలిసి దాదాపు పది మందిని అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లారని,  ఇందుకోసం భారీగా డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో దలేర్ కు వ్యతిరేకంగా 35 కేసులు నమోదయ్యాయి. తన మ్యూజిక్ ట్రూప్ లోని సభ్యులుగా చూపుతూ పలువురు యువకులను అక్రమంగా ఇండియా నుంచి విదేశాలకు పంపారనే అభియోగాలతో నమోదైన ఈ కేసులో దలేర్ మెహందీని దోషిగా పేర్కొంటూ పాటియాలా కోర్టు 2018 మార్చి 16నే రెండేళ్ల జైలు శిక్ష విధించింది.అయితే ఆ తర్వాత ఆయన బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా ఈ ఏడాది జులై 14న పాటియాలా కోర్టు మళ్లీ  తన పాత తీర్పునే వినిపించింది.  రెండేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. వెంటనే దలేర్ ను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.  అయితే మరోసారి ఇవాళ ఆయనకు బెయిల్ మంజూరు కావడం గమనార్హం. 

బాలీవుడ్ లో దలేర్ మెహందీకి మంచి క్రేజ్ ఉంది. ‘బోలో తార రా రా’  పాటతో ఎక్కుగా పాపులర్ అయ్యాడు. తెలుగులో బాహుబలి, యమదొంగ, బాద్షా, అరవింద సమేత వీరరాఘవ సినిమాలలోనూ పాటలు పాడాడు.