
గ్రేటర్ పరిధిలో ఒకేరోజు వరుస అగ్ని ప్రమాదాలతో ఆయా చోట్ల స్థానికులు ఉలిక్కిపడ్డారు. సనత్ నగర్‌లోని ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలగా, ఎస్ఆర్ నగర్‌లోని క్రిష్ ఇన్ రెస్టారెంట్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. కాటేదార్ పారిశ్రామిక వాడలో రబ్బర్ ఫ్యాక్టరీ కాలి బూడిదైంది. మైలార్ దేవ్ పల్లి పెట్రోల్ పంపులో పెను ప్రమాదం తప్పింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదాల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
హైదరాబాద్ సిటీ, వెలుగు: సనత్‌నగర్ రాజరాజేశ్వరి నగర్‌లోని ఓ ఇంట్లో గురువారం ఉదయం రిఫ్రిజిరేటర్ పేలింది. ఇంట్లోని సామగ్రి పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల సమాచారంతో హైడ్రా, ఫైర్టీమ్స్ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ లేదా గ్యాస్ లీకేజీతో ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బాధిత సత్యనారాయణ కుటుంబాన్ని పరామర్శించారు.
క్రిష్ ఇన్ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం
ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలోని క్రిష్ ఇన్ రెస్టారెంట్‌లో గురువారం సాయంత్రం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. ఐదంతస్తుల భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లోని రెస్టారెంట్‌లో మంటలు చెలరేగగా, నిర్వాహకుల సమాచారంతో ఫైర్ సేఫ్టీ అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. భవనంలో చిక్కుకున్న ఆరుగురిని సురక్షితంగా రక్షించారు. ఓ మహిళకు బ్రీతింగ్ సమస్య రావడంతో ఆక్సిజన్ మాస్క్‌తో ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఫైర్ ఆఫీసర్ సీహెచ్ పూర్ణ కుమార్ తెలిపారు.
పెట్రోల్ పంపులో తప్పిన పెను ప్రమాదం
శంషాబాద్: మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పెట్రోల్ పంపులో పెను ప్రమాదం తప్పింది. షాద్ నగర్ నుంచి దిల్సుఖ్ నగర్ వైపు వెళ్తున్న సుదర్శన్ అనే వ్యక్తి పెట్రోల్ పోయించుకొని వెళ్తున్న క్రమంలో పెట్రోల్ పంపులోనే కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన బంక్ సిబ్బంది ఫైర్ సిలిండర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ సమయంలో పెట్రోల్ పంపులో కొన్ని వాహనాలు పెట్రోల్ పోయించుకుంటున్నాయి. దీంతో వాహనదారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రబ్బర్ కంపెనీలో ఎగసిపడ్డ మంటలు
రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగింది. నేతాజీ నగర్ లోని తిరుపతి రబ్బర్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్‌కారణంగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 2 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.