ఉన్న నీళ్లు ఎత్తుకపోయి..ఎండబెట్టిర్రు..!

ఉన్న నీళ్లు ఎత్తుకపోయి..ఎండబెట్టిర్రు..!

సింగూరు పాపం అప్పటిదే..!
మూడేళ్ల క్రితం17 టీఎంసీల నీటి తరలింపు
ఎగువన వానల్లేవ్‌.. చుక్కనీరు వచ్చుడులేదు
0.8 టీఎంసీల డెడ్ స్టోరేజీలో సింగూరు
కాలేశ్వరం గ్రావిటీ పనులు షురూవే కాలే
ఆందోళనలో ఆయకట్టు రైతులు

సంగారెడ్డి/మెదక్ వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాకు వరప్రదాయిని అయిన సింగూరు జలాశయం నీటి కొరతతో ఘోషిస్తోంది. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో 29.97 టీఎంసీల నీటి సామర్ద్యంతో నిర్మించిన సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 0.8 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అది కూడా ఈ మధ్య కురిసిన వానలకు వచ్చింది. వానాకాలంలో కూడా సింగూర్ నిండని పరిస్థితి ఏర్పడడంతో సంగారెడ్డి, మెదక్ ‌జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు కింద దాదాపు 60 వేల ఎకరాలు ఉండగా, వ్యవసాయానికి వర్షాలు మినహా ప్రత్యామ్నాయ పరిస్థితులు కనిపించడం లేదు.

మూడేళ్ల క్రితం
మూడేళ్ల క్రితం సరిగ్గా ఇదే సీజన్‌‌లో నిండు కుండలా ఉన్న సింగూరు జలాశయం నుంచి17 టీఎంసీల నీటిని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండానే తరలించింది. నిజామాబాద్ కు 15 టీఎంసీలు, కామారెడ్డిలోని నిజాం సాగర్ ప్రాజెక్ట్ కు 2 టీఎంసీల నీటిని తరలించగా అప్పట్లో ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. ఎన్నికల టైంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం పార్టీలు లొల్లి చేస్తే కాలేశ్వరం నీటితో సింగూరు నింపుతామని గులాబీ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కనీసం కాల్వ పనులు కూడా షురూ చేయలేదు. పైగా వానకాలంలో వచ్చే వర్షాలతో సింగూర్ నిండుతుందని ప్రతి ఎండాకాలంలో చెప్పుకుంటూ వచ్చారు. మూడేళ్లు దాటి పోయాయి. అయినా సింగూర్ మాత్రం నిండలేదు. దీంతో గులాబీ నేతలకు ఏం చెప్పాలో అర్థం కాక ‘ఇదిగో ఆవు.. అదిగో పులి’ అన్నచందంగా కాలేశ్వరం నీళ్ల గురించి పదే పదే మాట్లాడుతున్నారు.

నిధులు మంజూరైనా…

కాలేశ్వరం ప్రాజెక్టు ప్రోగ్రాంలో సింగూర్ ఉండడం వల్ల గ్రావిటీతో నేరుగా నింపేందుకు ప్రభుత్వం భావించింది. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. వీటికి తోడు సింగూరు రిపేర్ పనులకు బడ్జెట్ లో రూ.7.6 కోట్లు రిలీజ్ అయినా ఇప్పటి వరకు పనులు స్టార్ట్ చేయలేదు. పాలకుల నిర్ల‌క్ష్యం ఇక్కడి రైతులకు శాపంగా మారింది. ఘనపూర్ రైతుల గడ్డు పరిస్థితి ఘనపూర్ ఆనకట్ట మెదక్ జిల్లాలో ఉన్న ఏకైక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు. నిజాం కాలంలో 1905లో మంజీరా నది మీద కొల్చారం మండలం చిన్న ఘనపూర్ ‌‌‌‌వద్ద ఈ ఆనకట్ట నిర్మించారు. ఎగువన సంగారెడ్డి జిల్లా పరిధిలో మంజీరా నది మీద సింగూరు ప్రాజెక్టు నిర్మించారు. ఈ ఆనకట్ట కింద కొల్చారం, పాపన్నపేట, మెదక్‌‌‌‌, హవేలి ఘనపూర్ ‌‌మండలాల పరిధిలో 21,625 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ మేరకు ఆయకట్టు భూముల్లో పంటల సాగు కోసం సింగూరు ప్రాజెక్ట్ లో 4.6 టీఎంసీల నీటి వాటా కేటాయించారు. ఘనపూర్ ఆనకట్ట నీటి నిలువ సామర్ద్యం 0.2 టీఎంసీలు మాత్రమే ఉండడంతో ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్ లలో ఆయకట్టు రైతులు అవసరాన్ని బట్టి సింగూరు ప్రాజెక్ట్ నుంచి దశల వారీగా నీటిని విడుదల చేస్తారు. సింగూరు నుంచి నీరు వస్తేనే ఘనపూర్ ఆయకట్టులో పంటలు సాగు చేయగలుగుతారు. లేకుంటే పొలాలు బీడు వారాల్సిందే. సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆయకట్టు రైతులకు గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ఇటు స్థానికంగా వానలు పడక, అటు ఎగువన ఉన్న సిం గూరు ప్రాజెక్ట్ నుంచి నీరు రాక వేలాది ఎకరాలు బీడు మారుతున్నాయి.

ముందు చూపు లేకనే..

కాలేశ్వరం నీటితో ఇతర జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళతో కనిపిస్తున్నాయి. పైగా అక్కడి వ్యవసాయం మూడు పువ్వులు..ఆరు కాయలుగా సాగుతోంది. కానీ ఇక్కడ ఉన్న నీటిని ఖాళీ చేసి సింగూరు పరివాహక ప్రాంత భూములను బీడుగా మార్చారని రైతులు ఆందోళన చెందుతున్నారు. పైగా ఇక్కడి నుంచే తాగు నీటి పథకాలను వినియోగించడం మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో రైతులు యావుసం విడిచిపెట్టే పరిస్థితులు వచ్చాయి. ముందు చూపు లేకుండా పాలకులు చేసిన తప్పిదానికి తాము అవస్థలు పడుతున్నామని సంగారెడ్డి, మెదక్ జిల్లాల రైతులు వాపోయారు. సింగూరు ప్రాజెక్టుగురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రజల్లో మరింత అభద్రతాభావం నెలకొంది.