వింబుల్డన్–2026: రెండో రౌండ్‌కు సిన్నర్‌‌, జొకోవిచ్‌‌

వింబుల్డన్–2026: రెండో రౌండ్‌కు సిన్నర్‌‌, జొకోవిచ్‌‌

లండన్: లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్–2026 గ్రాండ్‌‌స్లామ్ టోర్నీ తొలి రోజు ఉత్కంఠభరితంగా సాగింది. ప్రపంచ నంబర్ వన్ జన్నిక్ సిన్నర్, సీనియర్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఎంతో శ్రమించి విజయం సాధించగా, కొకో గాఫ్, సబలెంక సులువుగా రెండో రౌండ్‌‌కు దూసుకెళ్లారు. ఏడుసార్లు వింబుల్డన్‌‌ చాంపియన్‌‌గా నిలిచిన నొవాక్ జకోవిచ్ చైనాకు చెందిన వు యిబింగ్‌‌ తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌‌లో 6–4, 5–7, 6–4, 6–4 తేడాతో విజయం సాధించాడు.

 వు యిబింగ్‌‌ గట్టి పోటీ ఇవ్వడంతో జొకోవిచ్ గెలుపు కోసం నాలుగు సెట్ల పాటు తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ జన్నిక్ సిన్నర్ తొలి రౌండ్‌‌లోనే తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సెర్బియా ఆటగాడు మియోమిర్ కెచ్‌‌మనోవిచ్‌‌తో జరిగిన ఐదు సెట్ల సుదీర్ఘ పోరాటంలో సిన్నర్ 4–6, 6–3, 6–7, 6–2, 6–3 తేడాతో విజయం సాధించి రెండో రౌండ్‌‌కు చేరుకున్నాడు. 

సబలెంక, గాఫ్ ముందడుగు

మహిళల సింగిల్స్‌‌లో అర్యానా సబలెంక 6–2, 6–3తో తియోడోరా కోస్టోవిచ్‌‌ను మట్టికరిపించింది. అమెరికా స్టార్‌‌ కొకో గాఫ్ సైతం పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ 6–2, 6–1తో తమరా కోర్పట్ష్‌‌పై విజయాన్ని నమోదు చేసింది. అలాగే రష్యా యువ సంచలనం మిర్రా ఆండ్రీవా 7–5, 6–4తో మాగ్డా లినెట్‌‌ను ఓడించి రెండో రౌండ్‌‌లోకి ప్రవేశించింది. జపాన్ స్టార్, మాజీ గ్రాండ్‌‌స్లామ్‌‌ విజేత నవోమి ఒసాకా సైతం 6–1, 7–5తో ఎల్సా జాక్వెమోట్‌‌పై గెలిచింది.

తొలిరోజే నిష్క్రమించిన కాస్పర్ రూడ్

పురుషుల సింగిల్స్‌‌లో పోలాండ్ స్టార్ హుబెర్ట్ హుర్కాజ్ 6–4, 6–2, 7–6 (9–7)తేడాతో కాస్పర్ రూడ్‌‌కు షాకిచ్చి టోర్నీ నుంచి ఇంటికి పంపాడు. బ్రిటిష్ ఆటగాడు కామెరాన్ నోరీ  కూడా మైఖేల్ జెంగ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. గాయం కారణంగా బ్రిటన్ స్టార్ జాక్ డ్రేపర్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు.