సెస్ ఎన్నికలు ఇయ్యాల్నే

సెస్ ఎన్నికలు ఇయ్యాల్నే
  • పోటీలో 75 మంది అభ్యర్థులు.. 26న కౌంటింగ్

రాజన్న సిరిసిల్ల/వేములవాడ, వెలుగు: జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శనివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్​ కొనసాగనుంది. మొత్తం 15  డైరెక్టర్ స్థానాలు ఉండగా.. ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు, రెబెల్స్​ కలిపి 75 మంది బరిలో ఉన్నారు. సెస్ పరిధిలో 87,130  మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 252 పోలింగ్ బూత్​లు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 255 పంచాయతీలు, 2 మున్సిపాల్టీలు, 4 నియోజకవర్గాల్లో 750 మంది సిబ్బందిని కేటాయించారు. బ్యాలెట్ బాక్స్ ల డిస్ట్రిబ్యూషన్ కోసం 40 బస్సులను ఏర్పాటు చేశారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను రాష్ట్ర కో–ఆపరేటీవ్ ఎన్నికల అథారిటీ ఆఫీసర్​ సుమిత్ర, మమత, అడిషనల్​ కలెక్టర్ కిమ్యా నాయక్, ఆర్డీవో పవన్ కుమార్, సెస్ ఎండీ రామకృష్ణ శుక్రవారం పరిశీలించారు. సెస్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు 1,100 మంది పోలీసులు విధుల్లో ఉంటారని జిల్లా ఎస్పీ రాహుల్​ హెగ్డే తెలిపారు. మొత్తం 38 రూట్స్ గా డివైడ్ చేశామని, రూట్ బందోబస్తులో ఒక ఏఎస్సై ఇన్​చార్జిగా ఉంటారన్నారు. పోలింగ్ ఏరియాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలోని స్ట్రాంగ్​ రూమ్​కు బ్యాలెట్ బాక్స్ లను తరలిస్తారు. ఈ నెల 26న కౌంటింగ్ ఉంటుంది. 27న కొత్త డైరెక్టర్లు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు.

జోరుగా ప్రచారం

సెస్ ఎన్నికలను బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్​ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ అగ్ర నాయకులు సైతం ఈ ఎన్నికలపై ఫోకస్​ చేశారు. ఎన్నికల కోడ్​ లేకపోవడంతో గురు, శుక్రవారాల్లోనూ ప్రచారం జోరుగా సాగింది. బీజేపీ స్టేట్​ చీఫ్​ సంజయ్​ సిరిసిల్లలో పర్యటించారు. అధికార పార్టీ అవినీతిపైనే బీజేపీ నేతలు ఫోకస్​ పెట్టారు. మండలాల వారీగా బీజేపీ సీనియర్లు ఇన్​చార్జీ లుగా ఉండి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నుంచే శుక్రవారం టెలీకాన్ఫరెన్స్​ద్వారా ఓటర్లతో మాట్లాడారు. ‘క్యాండెట్​ను కాదు.. నన్ను చూసి ఓటు వేయండి’ అని కోరారు. కాంగ్రెస్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి విస్తృత ప్రచారం చేశారు.