సౌత్​లో క్లీనెస్ట్ మున్సిపాలిటీ సిరిసిల్ల

సౌత్​లో క్లీనెస్ట్ మున్సిపాలిటీ సిరిసిల్ల
  • ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానం
  • కరీంనగర్, హైదరాబాద్​, సిద్దిపేటకు కూడా .. తెలంగాణకు 12, ఏపీకి 11 
  • ఐదోసారి ‘‘క్లీనెస్ట్ సిటీ’’గా ఇండోర్

న్యూఢిల్లీ, వెలుగు: సౌత్ లోనే క్లీనెస్ట్ మున్సిపాలిటీగా సిరిసిల్ల నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల్లో లక్ష లోపు జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో సిరిసిల్ల ఫస్ట్ ప్లేసు దక్కించుకుంది. సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్ లో కరీంనగర్ కార్పొరేషన్ రెండో ప్లేసులో నిలిచింది. గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2021 అవార్డులను శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అందజేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0లో భాగంగా  ‘‘క్లీనెస్ట్ సిటీస్ ఆఫ్ ఇండియా” ర్యాంకింగ్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడారు. దేశాన్ని ‘‘నీట్ అండ్ క్లీన్’’గా ఉంచడమే, స్వాతంత్ర్య సమరయోధులకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పురి, సహాయ మంత్రి కౌశల్ కిషోర్, చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ తదితరులు పాల్గొన్నారు. 

మొత్తం 27 విభాగాల్లో 300లకు పైగా అవార్డులు అందజేశారు. జనాభా ప్రాతిపాదికన క్లీనెస్ట్ సిటీ, కంటోన్మెంట్ ఏరియాలు, జోనల్ లెవల్, స్టేట్ క్యాపిటల్ లెవల్, గంగా టౌన్ తదితర విభాగాల్లో అవార్డులు ఇచ్చారు. ఈసారి 9 ఫైవ్​–స్టార్ సిటీలు, 143 త్రీ–స్టార్ సిటీలు అవార్డులు దక్కించుకున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణాల కేటగిరీలో ఇండోర్ దేశంలోనే ‘‘క్లీనెస్ట్ సిటీ’’గా నిలిచింది. వరుసగా ఐదోసారి అవార్డు గెలుచుకుంది. రెండు, మూడు స్థానాల్లో సూరత్, విజయవాడ నిలిచాయి. లక్ష లోపు జనాభా కలిగిన సిటీల్లో మూడు అవార్డులు కూడా మహారాష్ట్రకే దక్కాయి. విటా, లోనోవాలా, సస్వాద్ అవార్డులు గెలుచుకున్నాయి.  

సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్​లో రెండో ర్యాంక్

స్వచ్ఛ సర్వేక్షణ్ లో మన రాష్ట్రానికి మొత్తం 12 అవార్డులు దక్కాయి. సఫాయి మిత్ర సురక్ష చాలెంజ్ లో తెలంగాణకు రెండో ర్యాంక్ వచ్చింది. ఈ అవార్డును ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ అందుకున్నారు. సిరిసిల్లకు వచ్చిన అవార్డును మున్సిపల్ చైర్ పర్సన్ జి. కళాచక్రపాణి, కమిషనర్ సమ్మయ్య అందుకున్నారు. కరీంనగర్ కు వచ్చిన అవార్డును మేయర్ సునీల్ రావు అందుకున్నారు. సిద్దిపేట మున్సిపాలిటీకి బెస్ట్ సెల్ఫ్ సస్టెనెబిలిటీ సిటీ అవార్డు రాగా, కమిషనర్ రమణాచారి తీసుకున్నారు. 50 వేల జనాభా కేటగిరీలో నిజాంపేట మున్సిపాలిటీకి ‘‘ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్’’, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి  ‘‘ఫాస్టెస్ట్ మూవర్ సిటీ’’ అవార్డులు దక్కాయి. 25 వేల లోపు జనాభా కేటగిరీలో ఘట్కేసర్ మున్సిపాలిటీకి ‘‘క్లీనెస్ట్ సిటీ’’, హుస్నాబాద్ మున్సిపాలిటీకి ‘‘ఫాస్టెస్ట్ మూవర్ సిటీ’’, కోస్గి మున్సిపాలిటీకి ‘‘ఇన్నోవేషన్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్’’ అవార్డులు వచ్చాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు బెస్ట్ సెల్ఫ్ సస్టెనెబిలిటీ అవార్డు దక్కింది. గ్రేటర్ హైదరాబాద్ కు గార్బేజ్ ఫ్రీ సిటీ, స్వచ్ఛ సురక్ష అవార్డులు దక్కాయి. కాగా, ఏపీకి 11 అవార్డులు వచ్చాయి. క్లీనెస్ట్ సిటీ కేటగిరీలో జాతీయ స్థాయిలో విజయవాడకు మూడో ర్యాంక్ వచ్చింది. గార్బేజ్ ఫ్రీ సిటీ రేటింగ్‌‌లో విజ‌‌య‌‌వాడ‌‌కు ఫైవ్ స్టార్, విశాఖ‌‌ప‌‌ట్నం, క‌‌డ‌‌ప‌‌, తిరుప‌‌తికి  త్రీ స్టార్ ర్యాంక్‌‌ లు దక్కాయి.

స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ లో పదో స్థానం

స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ లో 100కు పైగా అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్ బీ) ఉన్న రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణ 1,570 పాయింట్లతో పదో ప్లేసులో నిలిచింది. ఈ కేటగిరీలో మొత్తం 13 రాష్ట్రాలు ఉండగా... చత్తీస్ గఢ్ (4, 175 పాయింట్లు), మహారాష్ట్ర(2,845), మధ్యప్రదేశ్ (2,570), గుజరాత్ (2,570), ఏపీ(2,480) వరుసగా టాప్ ఫైవ్ లో నిలిచాయి. యూఎల్ బీలు 100 కన్నా తక్కువ ఉన్న 14 రాష్ట్రాల్లో జార్ఖండ్, హర్యానా, గోవా వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.