కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసి ఆరునెలలాయె.. ఒక్క పనీ కాకపాయె

కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను కలిసి ఆరునెలలాయె.. ఒక్క పనీ కాకపాయె
  • ఒక్క పనీ కాకపాయె సిరిసిల్ల జిల్లా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రజాప్రతినిధుల నారాజ్‌‌‌‌
  • ఆరునెలల కిందట ప్రగతిభవన్‌‌‌‌కు పిలిపించి పలు హామీలిచ్చిన కేటీఆర్‌‌‌‌‌‌‌‌ 
  • సమస్యలు పరిష్కరించాలని కోరిన లీడర్లు

అది జనవరి 2021, తన నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, లీడర్లు తనపై నారాజ్‌‌‌‌గా ఉన్నారని, ఓ మామిడి తోటలో మీటింగ్‌‌ పెట్టుకుని తమ ఆక్రోషం వెళ్లగక్కారని తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ వారిని ప్రగతిభవన్‌‌‌‌కు పిలిపించారు. ఒక్కో మండలానికి సంబంధించిన లీడర్లకు ఒక్కో రోజు కేటాయించారు. అందరినీ పిలిచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో రోడ్ల రిపేర్‌‌‌‌‌‌‌‌, సంఘ భవనాలకు నిధులు, కార్యకర్తలను ఆదుకోవడం వంటి పలు అంశాలు చర్చించారు. మూడు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. భోజనాలు పెట్టి, సెల్ఫీలు దిగి పంపించారు. కానీ ఆరు నెలలు గడిచినా ఒక్క పనీ కాలేదు.  లీడర్లు ఈ విషయాన్ని మళ్లీ మంత్రి దృష్టికి తీసుకెళ్లలేక, పనులు ఎప్పుడవుతాయో తెలియక అయోమయంలో పడిపోయారు. 
 

తంగళ్లపల్లి, వెలుగు: సిరిసిల్ల నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, మున్సిపల్‌‌‌‌ కౌన్సిలర్లు, సీనియర్‌‌‌‌‌‌‌‌ లీడర్లతో మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌ జనవరిలో వరుసగా సమావేశమై మాట్లాడారు. మండలాలు, గ్రామాల్లో ఉన్న సమస్యలు, పార్టీలో ఉన్న ఇబ్బందుల గురించి చర్చించారు. సర్పంచులు రోడ్ల రిపేర్‌‌‌‌‌‌‌‌, సంఘ భవనాలు, గ్రామాల అభివృద్ధికి నిధుల గురించి కోరగా,  సీనియర్‌‌‌‌‌‌‌‌ లీడర్లు పార్టీనే నమ్ముకున్న కార్యకర్తల కష్టాలు, తమ రాజకీయ భవిష్యత్‌‌‌‌ గురించి చర్చించారు. సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు ఇచ్చారు. పార్టీలో ఉన్న పేద కార్యకర్తలను ఆదుకుంటామని, వారికి డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూమ్‌‌‌‌ ఇండ్లు మంజూరు చేస్తామని ఆ టైంలో కేటీఆర్‌‌‌‌ వారికి‌‌‌‌ హామీ ఇచ్చారు. కార్యకర్తల్లో చదువుకున్న వారుంటే వారి అర్హతను బట్టి ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌లో ఉద్యోగాలు వచ్చేలా చూస్తానన్నారు. అర్హులైన కార్యకర్తలను గుర్తించి లిస్ట్‌‌‌‌ తయారు చేయాలని పార్టీ మండల అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మండల అధ్యక్షులు లిస్ట్‌‌‌‌ కూడా రెడీ చేశారు. అయినా ఇంతవరకు ఒక్కరికీ ప్రయోజనం కలగలేదు. 
సర్పంచులు, ఎంపీటీసీల తిప్పలు..
 ప్రగతిభవన్‌‌‌‌లో మంత్రిని కలిసిన వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాల్లో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.  త్వరలోనే పరిష్కారమవుతాయని గంపెడాశతో బయటకు వచ్చారు. కానీ ఆరు నెలలైనా హామీలు నెరవేరకపోవడం, గ్రామస్తులు నిలదీస్తుండడంతో ఆవేదనకు లోన వుతున్నారు. చేసిన పనులకు సైతం పైసలు సరిగా రాక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇక ఎంపీటీసీలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తమ పరిస్థితి ఉందని, నిధులు సరిగా రావట్లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అరకొర ఫండ్స్‌‌‌‌ వస్తున్నా పనులు చేయలేకపోతున్నామని వాపోయారు. 
దిక్కుతోచని స్థితిలో సీనియర్‌‌‌‌‌‌‌‌ లీడర్లు..
ఎన్నోఏళ్లుగా పార్టీ కోసం పని చేసిన పలువురు సీనియర్‌‌‌‌‌‌‌‌ లీడర్లు కార్పొరేషన్‌‌‌‌ పదవుల కోసం ఆశపడ్డారు. తమ తర్వాత పార్టీలో చేరిన వారికి పదవులు వస్తున్నాయని, తమను పట్టించుకోవడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ టైంలో సీనియర్‌‌‌‌‌‌‌‌ లీడర్లకు న్యాయం చేస్తామని మంత్రి చెప్పారు. కానీ ఒక్కరికీ పదవులు దక్కలేదు. విషయాన్ని మంత్రి దృష్టికి మళ్లీ తీసుకెళ్దామంటే కోప్పడుతారేమోనని అందరూ సైలెంట్‌‌‌‌ అయిపోయారు. సెల్ఫీల కోసమే ప్రగతిభవన్‌‌‌‌ పోయి వచ్చినట్టుంది తమ పరిస్థితి అని లీడర్లు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రజాప్రతినిధులు, పార్టీ లీడర్ల హామీలు నెరవేరుతాయో లేదో  చూడాలి మరి.