అయోధ్య: రామాలయ కానుకల్లో రోజూ ఆరేడు లక్షలు కాజేశారు...అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్ అంచనా

అయోధ్య: రామాలయ కానుకల్లో రోజూ ఆరేడు లక్షలు కాజేశారు...అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్ అంచనా
  •     సమగ్ర విచారణ కోరుతూ ఈడీకి పోలీసుల లేఖ!

అయోధ్య: రామాలయ కానుకల్లో ప్రతిరోజూ దాదాపు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పక్కదారి పట్టినట్లు సిట్ అంచనా వేసింది. ఈ భారీ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీలపై లోతైన విచారణ జరపాలని అయోధ్య పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు లేఖ రాయాలని నిర్ణయించారు. ఎస్‌బీఐ అధికారులను 'సిట్' విచారించడంతో విరాళాల చోరీ తీవ్రతపై ఒక స్పష్టత వచ్చింది. ఈ దొంగతనం వ్యవహారం వెలుగుచూడకముందు ట్రస్ట్ బ్యాంకు ఖాతాల్లో రోజుకు సగటున రూ.16 లక్షల నుంచి రూ.18 లక్షల విరాళాలు మాత్రమే జమ అయ్యేవి. 

కానీ, ఈ ఉదంతం బయటపడి నిఘా పెంచిన తర్వాత ఆ మొత్తం ఒక్కసారిగా రోజుకు రూ.24 లక్షల నుంచి రూ.26 లక్షలకు పెరిగింది. ఈ వ్యత్యాసాన్ని బట్టి చూస్తే ప్రతిరోజూ లక్షలాది రూపాయలు లూటీ అయ్యాయని సిట్ అధికారులు నిర్ధారించారు. ఈ విరాళాల లెక్కింపు విభాగానికి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి సుభాష్ శ్రీవాస్తవ నిర్లక్ష్యంపై కీలక సాక్ష్యాలు లభించాయి. గత ఫిబ్రవరిలోనే నిధుల చోరీ జరుగుతోందని లెక్కింపు బృందంలోని ఒక సభ్యుడు శ్రీవాస్తవ దృష్టికి తీసుకెళ్లగా.. "దేవుడు చూస్తున్నాడు.. అది నీ ఇల్లు లేదా నా ఇల్లు లూటీ అవ్వడం లేదుగా" అంటూ ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు తేలింది. 

ఈ కేసులో శ్రీవాస్తవ, అవినాశ్ శుక్లా సహా మొత్తం 8 మందిని సిట్ ఇప్పటికే అరెస్ట్ చేసింది. బంగారం, వెండి ఆభరణాలకు సరైన రికార్డులు లేకపోవడంతో దొంగతనం మరింత సులువైంది. మరోవైపు, ఈ వివాదం కారణంగా తమ పదవులకు రాజీనామా చేసిన ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్, ట్రస్టీలు అనిల్ మిశ్రా, గోపాల్ రావును సిట్ అధికారులు రెండోసారి విచారించారు. కొన్ని ఏండ్లుగా వీరి ఆస్తులు అకస్మాత్తుగా ఎలా పెరిగాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారి స్థిర, చరాస్తుల పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ట్రస్ట్ వార్షిక ఆడిట్ నివేదికలను తెప్పించుకున్న సిట్, వాటిని రీ-–ఆడిట్ చేయించే యోచనలో ఉంది.