లీకేజీ సూత్రధారులు ఇద్దరే..హైకోర్టుకు సిట్ రిపోర్ట్

లీకేజీ సూత్రధారులు ఇద్దరే..హైకోర్టుకు సిట్ రిపోర్ట్
  • ప్రవీణ్‌‌, రాజశేఖర్‌‌‌‌రెడ్డిలే కీలక నిందితులు
  • హైకోర్టుకు సిట్​ రిపోర్ట్..18 మంది నిందితుల్లో 17 మందిని అరెస్ట్ చేసినం
  • న్యూజిలాండ్‌‌లో ఉన్న ప్రశాంత్‌‌రెడ్డి కోసం లుక్‌‌ఔట్‌‌ నోటీసులు జారీ
  • మొత్తం 10 మంది పరీక్ష రాసినట్లు సిట్ వెల్లడి
  • రిపోర్టును పరిశీలించిన హైకోర్టు
  • టీఎస్‌‌పీఎస్సీ ఉద్యోగులుగా ఉంటూ పరీక్ష ఎలా రాస్తారని ప్రశ్న
  • నిందితుల వివరాలపై నోట్‌‌ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం
  • రిపోర్టును పిటిషనర్లకు ఇచ్చేందుకు నిరాకరణ.. విచారణ 24కు వాయిదా

హైదరాబాద్‌‌, వెలుగు: టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు స్టేటస్‌‌ రిపోర్టును హైకోర్టుకు సిట్ అందజేసింది. కమిషన్ మాజీ ఉద్యోగి ప్రవీణ్‌‌, ఔట్‌‌సోర్సింగ్‌‌ నెట్‌‌వర్క్‌‌ అడ్మిన్‌‌ రాజశేఖర్‌‌‌‌ రెడ్డి కీలక సూత్రధారులని పేర్కొంది. వీరిద్దరూ కలిసి టీఎస్‌‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్‌‌ సెక్షన్‌‌ను టార్గెట్‌‌ చేశారని తెలిపింది. సిట్ రిపోర్టును పరిశీలించిన హైకోర్టు.. నిందితుల వివరాలపై నోట్‌‌ సిద్ధం చేసి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. టీఎస్‌‌పీఎస్సీ ఉద్యోగులుగా ఉంటూ పరీక్ష ఎలా రాస్తారని ప్రశ్నించింది. పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉన్నప్పుడు వాళ్లను పరీక్ష పత్రాలను సిద్ధం చేయడానికి అనుమతి ఇవ్వడమేమిటని సర్కారును నిలదీసింది. టీఎస్‌‌పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంపై నిష్పాక్షిక దర్యాప్తు నిమిత్తం సీబీఐకి అప్పగించాలంటూ ఎన్‌‌ఎస్‌‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్​ సహా ముగ్గురు వేసిన పిటిషన్‌‌ను మంగళవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ బి.విజయ్‌‌సేన్‌‌రెడ్డి విచారణ చేపట్టారు. దర్యాప్తు నివేదికను తమకు ఇవ్వాలని పిటిషనర్ల తరపు సీనియర్‌‌ న్యాయవాది వివేక్‌‌ ఠంకా కోరగా.. అందుకు హైకోర్టు నిరాకరించింది. సీల్డ్‌‌ కవర్‌‌లోని రిపోర్టును ఎలా ఇస్తామని ప్రశ్నించింది. కోర్టు అవగాహన కోసమే నివేదికను సమర్పించారని, ఒకసారి చార్జిషీట్‌‌ దాఖలు చేస్తే అది పబ్లిక్‌‌ డాక్యుమెంట్‌‌ అవుతుందని చెప్పింది. విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.


సిట్‌‌‌‌‌‌‌‌ తరపున అడ్వొకేట్‌‌‌‌‌‌‌‌ జనరల్‌‌‌‌‌‌‌‌ బీఎస్‌‌‌‌‌‌‌‌ ప్రసాద్‌‌‌‌‌‌‌‌.. దర్యాప్తు నివేదికను సీల్డ్‌‌‌‌‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కోర్టుకు అందజేశారు. కోర్టుకు పూర్తి స్థాయి అవగాహన ఏర్పడేందుకు వీలుగా సీల్డ్‌‌‌‌‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌లో నివేదికను అందజేశామని, లీకేజీ ఎలా జరిగిందనే దానిపై నివేదికను పరిశీలించాలని కోరారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో, చట్ట ప్రకారం, లోతుగా విచారణకు ఆదేశించిందని, కానీ ఎలాంటి ఆధారాలు లేకుండా ఊహాజనిత ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిందితుల్లో ఒకరు న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌లో ఉంటారని, మిగిలిన వారిని సిట్‌‌‌‌‌‌‌‌ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు. కొంతమంది కావాలని లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, సీల్డ్‌‌‌‌‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌లోని అంశాలను పరిశీలిస్తే సిట్‌‌‌‌‌‌‌‌ దర్యాప్తు పురోగతి తెలుస్తుందని చెప్పారు.

సిట్‌‌‌‌‌‌‌‌ దర్యాప్తులో తీవ్ర లోపాలు: పిటిషనర్ల లాయర్

పిటిషనర్ల తరపు సీనియర్‌‌‌‌‌‌‌‌ న్యాయవాది వివేక్‌‌‌‌‌‌‌‌ ఠంకా వాదనలు వినిపిస్తూ.. సీల్డ్‌‌‌‌‌‌‌‌ కవర్‌‌‌‌‌‌‌‌ నివేదికలను బహిర్గతం చేయవచ్చంటూ సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో చెప్పిందని గుర్తు చేశారు. సిట్‌‌‌‌‌‌‌‌ దర్యాప్తులో తీవ్ర లోపాలున్నాయని, సాక్ష్యాలు మాయమవుతున్నాయని అన్నారు. టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ ఏర్పాటులోనే లోపాలున్నాయని చెప్పారు. దీనిపై హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉందని గుర్తు చేశారు. సాక్షాత్తు కమిషన్ చైర్మన్‌‌‌‌‌‌‌‌ పైనే ఆరోపణలున్నాయని, కోర్టు ధిక్కరణ కేసును సిట్‌‌‌‌‌‌‌‌ చీఫ్ ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌ కూడా పేపర్‌‌‌‌‌‌‌‌ లీకేజీపై కేసు పెట్టిందని తెలిపారు. ఈ బాగోతంలో ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐల పాత్ర ఉందని, దర్యాప్తు గురించి మంత్రి వెల్లడించారని చెప్పారు. సిట్‌‌‌‌‌‌‌‌ పిచ్చుకలపై బ్రహ్మాస్త్రాలు వేస్తోందని విమర్శించారు. పెద్దవాళ్లను వదిలేసి చిన్నవాళ్లను కేసులో ఇరికించిందన్నారు. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు ఉన్నాయని చెప్పారు. ఇది సుమారు 30 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్‌‌‌‌‌‌‌‌తో ముడిపడిన అంశమని, సిట్‌‌‌‌‌‌‌‌ దర్యాప్తు సక్రమంగా లేదని, లీకేజీపై సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

పేపర్లు సెట్​ చేసిందెవరు?

ప్రశ్నపత్రాలను ఎవరు తయారు చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కమిషన్‌‌లో పనిచేసే ఔట్‌‌సోర్సింగ్‌‌ ఉద్యోగులు పరీక్షలు రాసినట్లు పత్రికల్లో చూశామని, వారిని పరీక్షలు రాసేందుకు ఎలా అనుమతి ఇచ్చారని నిలదీసింది. ఏజీ కల్పించుకుని పరీక్షలు రాసేవాళ్లను.. పరీక్షల నిర్వహణ, పేపర్ల అంశాలకు దూరంగా పెట్టినట్లు చెప్పారు. లీకేజీ ఎలా జరిగిందన్న విషయంపై సీల్డ్‌‌ కవర్‌‌ రిపోర్టును చూడాలన్నారు. 

సిట్ రిపోర్టులోని వివరాలివీ..

250 పేజీల స్టేటస్‌‌‌‌‌‌‌‌ రిపోర్టును హైకోర్టుకు సిట్ అందించింది. 18 పేజీల సమ్మరీ రిపోర్టును ఫైల్‌‌‌‌‌‌‌‌ చేసింది. గ్రూప్‌‌‌‌‌‌‌‌1, అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ఇంజినీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డివిజనల్‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ పేపర్స్ పరీక్షకు ముందే లీక్‌‌‌‌‌‌‌‌ అయినట్లు తెలిపింది. 6 పరీక్షలకు సంబంధించిన మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్వశ్చన్ పేపర్స్‌‌‌‌‌‌‌‌ను ప్రవీణ్, రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి దొంగిలించినట్టు వెల్లడించింది. పేపర్లను 4 పెన్‌‌‌‌‌‌‌‌డ్రైవ్స్‌‌‌‌‌‌‌‌లో స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి.. అమ్మేందుకు ప్లాన్ చేసినట్లు వివరించింది. టీఎస్‌‌‌‌‌‌‌‌పీఎస్సీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ జనార్దన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్‌‌‌‌‌‌‌‌, సెక్షన్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకరలక్ష్మిని విచారించినట్లు రిపోర్టులో తెలిపింది. వారిచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ను పొందుపరిచామని, శంకరలక్ష్మిని ప్రధాన సాక్షిగా పేర్కొన్నామని చెప్పింది. ఈ కేసులో మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చినట్లు వివరించింది. ఇందులో పేపర్ లీకేజీతో గ్రూప్‌‌‌‌‌‌‌‌1, ఏఈ, డీఏఓ పరీక్షలు రాసిన 10 మంది సహా మొత్తం 17 మందిని అరెస్ట్ చేసినట్లు  వెల్లడించింది. న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ప్రశాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి కోసం లుక్‌‌‌‌‌‌‌‌ఔట్‌‌‌‌‌‌‌‌ నోటీసులిచ్చినట్లు పేర్కొంది. సాక్షులు, గ్రూప్ 1 రాసిన 121 మంది అభ్యర్థుల స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్ కూడా హైకోర్టుకు అందించింది. ఈ వ్యవహారంలో రూ.40 లక్షలు చేతులు మారినట్లు సిట్ తన నివేదికలో వెల్లడించింది. ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్ ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉందని తెలిపినట్లు సమాచారం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారికి నోటీసులిచ్చామని, దర్యాప్తు కొనసాగుతున్నదని వెల్లడించింది.