ఫాంహౌస్ కేసులో బండి సంజయ్​ పేరు చెప్పాలని సిట్ ఒత్తిడి : లాయర్ శ్రీనివాస్

ఫాంహౌస్ కేసులో బండి సంజయ్​ పేరు చెప్పాలని సిట్ ఒత్తిడి : లాయర్ శ్రీనివాస్

హైదరాబాద్,వెలుగు: ఫామ్​హౌస్  ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్  అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని లాయర్ భూసారపు శ్రీనివాస్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు. కేసులో ఎలాంటి సంబంధం లేని వారి పేర్లు చెప్పాలని వేధిస్తున్నారని పేర్కొంటూ ఆయన రిట్​ పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా కీలక నేతల పేర్లు చెప్పాలని తనపై తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నారని అందులో పేర్కొన్నారు. సిట్ మెంబర్స్ రెమా రాజేశ్వరి సహా టీమ్ అంతా తనను భయాందోళనకు గురిచేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఇప్పటికే తనను రెండుసార్లు విచారించారని, విచారణలో ప్రధానంగా బీజేపీ నేతల వివరాలనే ప్రస్తావించారని పేర్కొన్నారు.

సిట్ విచారణ పూర్తిగా రాజకీయ కోణంలో జరుగుతున్నదని ఆయన ఆరోపించారు. పక్షపాత ధోరణితో జరుగుతున్న దర్యాప్తుపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును లాయర్​ శ్రీనివాస్​ కోరారు. మొత్తం 89 పేజీల్లో సిట్ విచారణ గురించి ఆయన ప్రస్తావించారు. సిట్ సభ్యులు దేశ, రాష్ట్ర బీజేపీ నేతలే టార్గెట్ గా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. విచారణ పారదర్శకంగా జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో రద్దు చేయడంతోపాటు సిట్ ను కూడా రద్దు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆయన కోరారు. సీబీఐతో విచారణ జరిపేలా ఆదేశించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. శ్రీనివాస్ ఫైల్ చేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి.