- బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్లకు, ఫోన్ ట్యాపింగ్‌కు లింకు
- ఫార్మా, ఐటీ, వ్యాపారవేత్తల నుంచి రూ. వందల కోట్ల విరాళాలు
- బాండ్లు కొనుగోలు చేసినవారి వివరాలు ట్యాపింగ్ లిస్టులో
- సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు నుంచి రూ.13 కోట్ల బాండ్లు
- బ్లాక్ మెయిల్ చేసి రాయించుకున్నారని ఇప్పటికే శ్రీధర్ రావు ఆరోపణ
- ఈ కోణంలో కేటీఆర్‌ను ప్రశ్నించేందుకు సిట్ అధికారుల ఏర్పాట్లు
హైదరాబాద్,వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు గురువారం సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌లోని సిట్ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది. నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ ఇంటికి వెళ్లిన సిట్ బృందం.. ఆయన అందుబాటులో లేకపోవడంతో వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు అందించింది. ‘‘పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో 2024 మార్చి 10 న నమోదైన క్రైం నెంబర్ 243/2024 కేసులో దర్యాప్తు జరిగిందని, ఇందులో వెల్లడైన అంశాల ప్రకారం మీ పాత్రకు సంబంధించి విచారణ జరపాల్సి ఉంది” అని నోటీసులో పేర్కొన్నారు. సెక్షన్ 160 సీఆర్పీసీ ప్రకారం.. దర్యాప్తు అధికారి జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ముందు హాజరుకావాలని తెలిపారు. నోటీసు తీసుకున్న తర్వాత ఒకవేళ విచారణకు హాజరుకాకపోతే చట్టప్రకారం చర్యలుంటాయని కేటీఆర్‌ను
హెచ్చరించారు.
గత ప్రభుత్వ హయాంలో భారీ ప్రాజెక్టులు చేపట్టిన ఓ బడా కాంట్రాక్ట్ సంస్థతోపాటు ఫార్మా, ఐటీ సహా అన్ని రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తల నుంచి ఎలక్టోరల్ బాండ్ల పేరుతో బీఆర్‌ఎస్‌కు రూ.1,322 కోట్ల విరాళాలు వచ్చాయి. బాండ్లు కొనుగోలు చేసిన వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్, ఫార్మా, జువెల్లరీ, హవాలా వ్యాపారులు ఉండగా, వీరి ఫోన్ నంబర్లను ప్రణీత్‌రావు టీమ్ ట్యాపింగ్ చేసినట్లు సిట్ గుర్తించింది. ట్యాపింగ్‌కు గురైన ఫోన్ నంబర్ల ఆధారంగా ఆయా వ్యక్తుల నుంచి సిట్ సమాచారం సేకరించింది. కాగా, విరాళాల రూపంలో ఎలక్టోరల్ బాండ్లు సేకరించడంలో బీఆర్‌ఎస్ పార్టీ బ్లాక్‌మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడినట్లు పలువురు వెల్లడించినట్లు తెలిసింది. బాధితులు, సాక్షుల వాంగ్మూలాల ఆధారంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ను సిట్ అధికారులు విచారణకు పిలిచినట్లు సమాచారం.
కీలకంగా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్‌రావు వాంగ్మూలం
ఈ వ్యవహారంలో ప్రధానంగా సంధ్య కన్వెన్షన్ శ్రీధర్‌రావు వాంగ్మూలం కీలకంగా మారినట్లు తెలిసింది. ఓ పెట్రోబల్ బంక్ వివాదంలో బీఆర్ఎస్ నాయకులు సూచించిన విధంగా వీఐపీలు, వ్యాపారవేత్తలకు సంబంధించిన సివిల్ వివాదాలను సెటిల్‌మెంట్ చేశారు. ఇందులో భాగంగా రియల్టర్ సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావుపై అక్రమ కేసులు బనాయించారు. హైటెక్ సిటీలోని ఓ పెట్రోల్ బంక్ వివాదంలో ఓ టీవీ చానెల్‌కు చెందిన సాంబశివరావు మధ్య సెటిల్‌మెంట్ చేశారు. శ్రీధర్‌రావుతో రూ. 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనేలా ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత రూ.2 కోట్లు సాంబశివరావుకు ఇప్పించారు. ఈ క్రమంలోనే ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు బంధువైన రవీందర్‌రావు, శ్రీధర్‌రావు మధ్య కూడా సెటిల్‌మెంట్ జరిగినట్లు తెలిసింది. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే జరిగినట్లు శ్రీధర్‌రావు ఇప్పటికే సిట్‌కు స్టేట్‌మెంట్ ఇచ్చారు.
