- చానల్ యాజమాన్యం, సీఈవోపైనా కేసులు?
- యూట్యూబ్ చానళ్లను పరిశీలిస్తున్న టీమ్
- పరారీలో మరికొందరు.. ఫోన్లు స్విఛాఫ్
- కొన్ని చానళ్లు ఇప్పటికే
- ఆ వీడియోలు డిలీట్ చేసినట్టు టాక్
హైదరాబాద్: మహిళా ఐఏఎస్ ను డీఫేమ్ చేసిన కేసులో సిట్ దూకుడు పెంచింది. మంగళవారం (జనవరి 13) రాత్రి నుంచి ఇప్పటి వరకు ఎన్టీవీకి చెందిన నలుగురు జర్నలిస్టులను అరెస్టు చేశారు. వారిలో దొంతు రమేశ్, పరిపూర్ణాచారి, సుధీర్. శాస్త్రి ఉన్నారు. ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేశ్ ను హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి బ్యాంకాక్ విమానంలో విదేశీ విహారయాత్రకు వెళ్తుండ గా ఆయనను సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ నలుగురిని ఇవాళ మెజిస్ట్రే ట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఛానల్ యజమాన్యం అజ్ఞాతంలో ఉన్నట్టు అనధికారిక సమాచారం. జనవరి 8న ఎన్టీవీ లో ప్రసారమైన కథనంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి మధ్య వివాహే తర సంబంధం ఉందని ఆరోపిస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారనే అభియోగం ఉంది. ఈ కథనం మహిళా అధికారిణి ప్రతిష్ఠను దిగజార్చే విధంగా ఉందనీ, తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదారి పట్టించిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఐఏఎస్ అసోసియేషన్ క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసింది. జనవరి 10న కంప్లైంట్ ఆధారంగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో ఎఫ్ఎఆర్ నమోదైంది.
ఈ కథనంపై మంత్రి కోమటిరెడ్డి ఈ ఆరోపణలపై గతంలోనే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "వ్యూస్, రేటింగ్స్ కోసం మహిళా అధికారు లపై దుష్ప్రచారం చేయడం తగదు. నాపై ఏమైనా రాయండి, తట్టుకుంటా.. కానీ మహిళలపై ఇలా చేయొద్దు. ఇంకా తనివి తీరకపో తే నాకు విషం ఇచ్చి చంపేయండి" అంటూ భావోద్వేగంతో మీడియాను హెచ్చరించారు. మీడియా ఎదుటే కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఎపిసోడ్ వెనుక పెద్ద కుట్ర ఉందని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఈ మేరకు దీనిపై హైద రాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నారు. ఎవరు సమాచారం లీక్ చేశారు? ఎవరి ఆదేశాల మేరకు ఈ కథనం ప్రసారమైంది అనే అంశాలను సిట్ పరిశీ లిస్తోంది. ఈ క్రమంలో ఎన్టీవీకి చెందిన ఈ ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తోంది.
యూట్యూబ్ చానళ్లలోనూ..
ఎన్టీవీలో ప్రసారమైన ఈ కథనాన్ని పలు యూట్యూబ్ చానళ్లు మసాలా దట్టించి వండి వార్చాయనే ఆరోపణలున్నాయి. ఓ పార్టీకి అనుకూలంగా ఉన్న సోషల్ మీడియాలోనూ దీనిపై రకరకాల పోస్టింగ్ లు చేశారు. షాడో బొమ్మలు వేసి నానా హంగామా చేసిన సదరు సోషల్ మీడియా హ్యాండిల్స్ పైనా సిట్ దృష్టి పారించింది. ఈ క్రమంలో ఈ కథనాన్ని ప్రసారం చేసిన కొందరు యూట్యూబర్లు ఆ వీడియోలను డిలీట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో పాటు తమను అరెస్టు చేస్తారనే ముందస్తు సమాచారంతో పరారయ్యారనే టాక్ ఉంది.
