వీకెండ్‌‌ పార్టీల్లో లోకల్‌‌ డ్రగ్స్‌‌

వీకెండ్‌‌ పార్టీల్లో లోకల్‌‌ డ్రగ్స్‌‌
  • స్థానిక పెడ్లర్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు
  •     పార్టీలకు సప్లయ్‌‌ చేసిన పీఏ శ్రవణ్‌‌, డ్రైవర్ శరత్‌‌ కుమార్‌‌
  •     గోవా, షిమ్లా నుంచి ఆర్డర్లపై తెచ్చిస్తున్న కౌశిక్ రవి
  •     వారం రోజుల ముందుగానే వీకెండ్ పార్టీకి ప్లాన్ చేసిన రోహిత్ రెడ్డి
  •     ఎంపీ పుట్టా మహేశ్‌‌ మినహా ఏడుగురు నిందితులను విచారిస్తున్న సిట్‌‌
  •     నిందితులను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని వాదనలు
  •     రేపు తీర్పు వెల్లడించనున్న ఉప్పరపల్లి కోర్టు ‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్‌‌ రెడ్డి ఫామ్‌‌హౌస్‌‌ డ్రగ్స్‌‌ కేసులో సిట్‌‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. రోహిత్‌‌ రెడ్డి ఫామ్‌‌హౌస్‌‌ కేంద్రంగా జరుగుతున్న డ్రగ్స్‌‌ పార్టీలకు.. షిమ్లా, గోవాతో పాటు లోకల్‌‌ పెడ్లర్ల నుంచి డ్రగ్స్‌‌ కొనుగోలు చేస్తున్నట్లు ఆధారాలు సేకరించింది. ఈ మేరకు అతడి పీఏ శ్రవణ్‌‌ కుమార్‌‌‌‌, డ్రైవర్‌‌‌‌ శరత్‌‌ కుమార్‌‌‌‌, కొకైన్‌‌తో చిక్కిన న్యాయవాది కౌశిక్‌‌ రవి, పబ్‌‌ ఓనర్‌‌‌‌ అర్జున్‌‌ రెడ్డిని బుధవారం సిట్‌‌ బృందం సుదీర్ఘంగా విచారించింది. ఫామ్‌‌హౌస్‌‌లో జరిగే వీకెండ్ పార్టీల్లో ఫారిన్ లిక్కర్‌‌‌‌తో పాటు కొకైన్‌‌, ఎండీఎంఏ సహా పలు రకాల డ్రగ్స్‌‌ వినియోగిస్తున్నట్లు గుర్తించింది. 

డ్రగ్స్​పార్టీకి 15 రోజుల ప్లాన్​

ఇటీవల వ్యాపారాల్లో నష్టాల కారణంగా రోహిత్‌‌ రెడ్డి డిప్రెషన్‌‌లోకి వెళ్లాడని, ఈ క్రమంలోనే తన ఫామ్‌‌హౌస్‌‌లో వీకెండ్‌‌ పార్టీకి ఏర్పాట్లు చేసినట్లు సిట్‌‌ గుర్తించింది. శనివారం రాత్రి జరిగిన డ్రగ్స్ పార్టీకి 15 రోజుల నుంచే రోహిత్‌‌ రెడ్డి ప్లాన్ చేసినట్లు సిట్‌‌ విచారణలో వెలుగు చూసింది. షిమ్లా నుంచి కొకైన్ తీసుకొచ్చినట్లు నిందితుడు కౌశిక్ రవి కూడా సిట్​విచారణలో అంగీకరించినట్లు సమాచారం. గతంలోనూ పలు వీకెండ్ పార్టీలకు సైతం రోహిత్‌‌ సూచనల మేరకు శ్రవణ్‌‌ కుమార్, శరత్‌‌ కుమార్‌‌‌‌ పెడ్లర్ల నుంచి డ్రగ్స్‌‌ సేకరిస్తున్నట్లు సిట్ ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. 

పీఏ, డ్రైవర్ల చుట్టూ సిట్‌‌ విచారణ

డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించి శ్రవణ్‌‌‌‌, శరత్‌‌ సహా రోహిత్‌‌ రెడ్డి బ్యాంక్‌‌ స్టేట్‌‌మెంట్లను సిట్​టీమ్​ పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు కౌశిక్ రావు ఆర్డర్లపై గోవా, షిమ్లా నుంచి కొకైన్ కొనుగోలు చేస్తున్నట్లు సిట్‌‌ విచారణలో బయటపడింది. శనివారం జరిగిన పార్టీలో కొకైన్ మాత్రమే వినియోగించారా.. ఇతర రకాల డ్రగ్స్‌‌ తీసుకున్నారా? అనే కోణంలో సిట్‌‌ దర్యాప్తు చేస్తోంది. 

ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌‌ యాదవ్‌‌కు యూరిన్ టెస్ట్‌‌లో నెగిటివ్ రాగా, బ్లడ్‌‌ టెస్ట్‌‌లో మాత్రం యాంఫిటమిన్‌‌, మెథా యాంఫిటమిన్ డ్రగ్స్​ తీసుకున్నట్లు బయటపడింది. పార్టీలో కేవలం కొకైన్ మాత్రమే వినియోగిస్తే.. మహేశ్‌‌ యాదవ్‌‌ రిపోర్ట్‌‌లో ఇతర డ్రగ్స్‌‌ ఆనవాళ్లు రావడంపై సిట్​ఆధారాలు సేకరిస్తున్నది. 

కస్టడీ పిటిషన్‌‌పై ముగిసిన వాదనలు.. రేపు తీర్పు

పోలీసులపై కాల్పులకు సంబంధించి రోహిత్‌‌ రెడ్డి, నమిత్‌‌ శర్మ, రితేశ్‌‌ రెడ్డి కస్టడీ పిటిషన్లపై బుధవారం ఉప్పర్‌‌‌‌పల్లి కోర్టులో విచారణ జరిగింది. నిందితులను పది రోజుల పాటు కస్టడీ విచారణకు అనుమతివ్వాలని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌‌‌ కోరారు. వాదనలు ముగిసిన అనంతరం జడ్జి తన తీర్పును రిజర్వ్‌‌ చేశారు. ఈ నెల 20న ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు. కాగా, కేసు తీవ్రత నేపథ్యంలో 5 లేదా 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి లభించే అవకాశాలున్నట్లు తెలిసింది.