హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్‌తో పాటు ఆయన కుమారుడు అరవింద్ కుమార్ యాదవ్‌ను సిట్ విచారించింది. ఆదర్శ్‌నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో బుధవారం ఇద్దరి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన ఫోన్ నంబర్ల ఆధారంగా వివరాలు సేకరించింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు రెండేండ్ల ముందు నుంచే అంజన్ కుమార్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేసినట్టు వెల్లడించింది. ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ స్టేట్‌మెంట్ కూడా రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా, అసెంబ్లీ ఎన్నికల సమయంలో అంజన్ కుమార్ యాదవ్ హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, అనిల్ కుమార్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంజన్ కుమార్ సహా ఇద్దరు కుమారుల ఫోన్ నంబర్లను మానిటరింగ్ చేసినట్టు సిట్ దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ మేరకు సంబంధిత ఫోన్ నంబర్లను చూపి.. ఆయా ఫోన్ నంబర్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమిటని వివరాలు సేకరించారు. సిట్ విచారణ అనంతరం అంజన్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తి చూపిస్తున్నామని తమపై నిఘా పెట్టారని తెలిపారు.
