సీతారాముల కల్యాణ వైభోగం

సీతారాముల కల్యాణ వైభోగం

భద్రాచలం, వెలుగు: సీతారాముల కల్యాణం గురువారం వైభవంగా జరిగింది. ముందుగా గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో మూలవరులకు సుప్రభాత సేవ చేశారు. బాలబోగం నివేదించారు. తర్వాత కల్యాణమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి కల్యాణ క్రతువును షురూ చేశారు. విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత యజ్ఞోపవీతం, కంకణధారణ, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక, మంత్రపుష్పం సమర్పించారు. మాధ్యాహ్నిక ఆరాధనలు తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.  పీడీ రఘురామన్​, పీఆర్​ లోకేశ్వరీ దంపతులు శ్రీసీతారామచంద్రస్వామి నిత్యాన్నదానానికి రూ.1లక్ష విరాళం ఇచ్చారు.

వైభవంగా విశ్వరూప సేవ
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గురువారం రాత్రి విశ్వరూప సేవ వైభవంగా నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి తర్వాత వచ్చే బహుళ ద్వాదశి ఘడియల్లో దేవస్థానంలోని ఉత్సవమూర్తులన్నింటినీ ఒకచోట చేర్చి ఆరాధన నిర్వహించడం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ప్రత్యేకత. ఆలయంలోని 108 దేవతామూర్తులను ఒకచోటకు చేర్చి ప్రత్యేక అలంకరణ చేయడంతో భద్రాద్రి కలియుగ వైకుంఠాన్ని తలపించింది.  అంతా రామమయం, జగమంతా రామమయం అన్న భక్తరామదాసు కీర్తనలో భాగంగా రాముడే విశ్వరూపుడిగా భావించి ఆలయంలోని వరాహస్వామి, వేంకటేశ్వరస్వామి, కృష్ణుడు తదితర ఉత్సవమూర్తులతో పాటు ఆళ్వార్ల ఉత్సవ విగ్రహాలను సర్వదేవతాలంకారంలో అలంకరించారు. గరుడవాహనంపై రాముడు ఆసీనుడు కాగా సాయంకాలం సమయంలో ఆయన సన్నిధిలో ఇతర ఉత్సవమూర్తులకు ఆరాధన నిర్వహించి కదంబం అనే ప్రత్యేక ప్రసాదాన్ని నివేదన చేశారు.