‘సీతమ్మసాగర్’లో కదలిక..చర్ల మండలంలో 34.25 ఎకరాల భూమి సేకరణకు చర్యలు..

‘సీతమ్మసాగర్’లో కదలిక..చర్ల మండలంలో 34.25 ఎకరాల భూమి సేకరణకు చర్యలు..

భద్రాచలం, వెలుగు  : సీతమ్మసాగర్​ బ్యారేజీ నిర్మాణంలో కదలిక వచ్చింది. పనులను రాష్ట్ర ప్రభుత్వం సర్కార్​ స్పీడప్​ చేస్తోంది. ఆగిన భూసేకరణ పనులను తిరిగి షురూ చేసింది. చర్ల మండలం దండుపేట(జెడ్​) గ్రామంలో 34.25 ఎకరాల భూమిని సేకరించేందుకు ఇటీవల నోటిఫికేషన్​ను జారీ చేసింది. చెన్నై ఎన్జీటీ బెంచ్​ ఆదేశాలతో ఆగిన సీతమ్మసాగర్​  బ్యారేజీ పనులను తిరిగి ప్రారంభం కానున్నాయి. గతంలో ఎన్జీటీ పనులు ఆపాలని ఆదేశిస్తూ, ప్రభుత్వానికి 53.41కోట్ల జరిమానాను కూడా విధించింది. అయితే ముందుగా దీనిపై అప్పీలు చేసేందుకు సర్కార్​ సమాలోచనలు చేసినా తర్వాత సమయం వృథా చేయకుండా అనుమతులు తీసుకొచ్చి బ్యారేజీ నిర్మాణం కోసం ఆటంకాలు తొలగించుకోవాలని నిర్ణయించింది. 

ఈ నేపథ్యంలోనే ఇటీవల బ్యారేజీ డీపీఆర్​కు ఎకనమిక్​ ఫీజబులిటీ, టెక్నికల్​ అడ్వయిజరీ కమిటీల అనుమతి పొందింది. ఇక పర్యావరణ, అటవీశాఖ అనుమతులు తెచ్చుకోవడంపైనే దృష్టిసారించింది. ఈ లోగా భూసేకరణ తంతును ముగించాలని భావించి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది. రూ.3,426కోట్లతో సీతమ్మసాగర్​ బ్యారేజీని దుమ్ముగూడెం-అశ్వాపురం మండలాల మధ్య కాటన్​ ఆనకట్టకు దిగువన 37 టీఎంసీల సామర్థ్యం గల బ్యారేజీని, 320 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రంను నిర్మిస్తోంది. 

నాటి సర్కార్​ నిర్వాకంతోనే...

గత ప్రభుత్వం రూ.13,500కోట్లతో సీతారామప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. నిధుల విడుదలలో జాప్యం, పనుల ఆలస్యం కారణంగా అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈలోగా సీతారామా ప్రాజెక్టుకు అవసరమైన నీటి లభ్యత కోసం సీతమ్మసాగర్​ బ్యారేజీని నిర్మాణం కోసం ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. దీనితో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఫలితంగా నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​ చెన్నై బెంచ్​ బ్యారేజీ నిర్మాణం ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో సీతారామ ప్రాజెక్టు మూడు పంప్​ హౌస్​లు మూలనపడే పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్​ సర్కార్​ వచ్చిన వెంటనే జిల్లాకు చెందిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఇరిగేషన్​ ప్రాజెక్టుపై దృష్టిపెట్టి ఇరిగేషన్​ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డికి వివరించారు. డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కతో పాటు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సీతారామా, సీతమ్మసాగర్​ బ్యారేజీ విషయంపై యాక్షన్​ ప్లాన్​ మొదలుపెట్టారు. మూడు పంపుహౌస్​లను అందుబాటులోకి తెచ్చి రాజీవ్​సాగర్​ కెనాల్​ ద్వారా నాగార్జునసాగర్​ ప్రాజెక్టు కెనాల్​కు నీటిని అందించారు. గతేడాది ఆగస్టులోనే గోదావరి రివర్​మేనేజ్​మెంట్ బోర్డు, టెక్నికల్ అడ్వయిజరీ కమిటీలలో వాదనలు వినిపించి కాస్టు బెనిఫిట్​ రేషియోపై కేంద్రం సంతృప్తి చెందేలా చర్యలు తీసుకున్నారు. దీనితో సీతారామ ప్రాజెక్టు డీపీఆర్​కు అనుమతులపై ఆశలు రేకెత్తించారు. ఏన్కూర్​ లింక్​ కెనాల్​ డిజైన్​ చేసి మూడు ప్యాకేజీలకు టెండర్లు పిలిచారు. గత సర్కారు ఆలస్యం కారణంగా ఇప్పుడు రూ.19వేల కోట్లకు ప్రాజెక్టు ఖర్చు పెరిగింది.

భూసేకరణకు నోటిఫికేషన్​

సీతమ్మసాగర్​ బ్యారేజీ నిర్మాణంలో భాగంగా బ్యాక్​వాటర్​ నుంచి పరివాహక ప్రాంతాన్ని కాపాడేందుకు కరకట్టలు నిర్మించాల్సి ఉంది. ఎన్జీటీ ఆదేశాలతో ఆగిన పనులు తిరిగి షురూ అయ్యేలా భూసేకరణకు ప్రస్తుత సర్కార్​ శ్రీకారం చుట్టింది. చర్ల మండలం దండుపేట(జీ) గ్రామంలో 34.25 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. పట్టాభూమి28.03 ఎకరాలు, ప్రభుత్వం భూమి 6.25 ఎకరాలను సేకరిస్తున్నామని, అభ్యంతరాలు ఉంటే తెలపాలని భద్రాచలం సబ్​ కలెక్టర్​ ఆఫీసు నుంచి నోటిఫికేషన్ వచ్చింది. ఈ భూముల్లో మామిడి చెట్టు 1, జామచెట్టు 1, నిమ్మ చెట్టు 1, వేపచెట్టు 1, పొక్క చెట్లు 3, తాటిచెట్లు 128, టేకుచెట్లు 601, బావి 1, బోరుబావులు 9, పైపులైన్లు 7, షెడ్డు 1 ఉన్నాయి. మొత్తంగా 18 కట్టడాలు, 736 చెట్లకు పరిహారం ఇవ్వనున్నారు. ఒకవైపు అనుమతులు తెచ్చుకోవడంపై ప్రధానంగా దృష్టిసారించి, మరోవైపు అవసరమైన భూమిని సేకరించేందుకు సర్కారు సిద్ధమైంది.