జనవరి 6న నాచారం డీపీఎస్ లో సీతారామ కళ్యాణ మహోత్సవం

జనవరి 6న నాచారం డీపీఎస్ లో సీతారామ కళ్యాణ మహోత్సవం
  •    అయోధ్య అక్షింతల పంపిణీ ఉంటుందన్న నిర్వహకులు మల్క కొమరయ్య  

హైదరాబాద్​, వెలుగు : ఈనెల 22న అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం నాచారంలో ఢిల్లీ పబ్లిక్ ​స్కూల్ (డీపీఎస్) క్యాంపస్​లో సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు డీపీఎస్, పల్లవి గ్రూప్​ ఆఫ్​ ఇనిస్టిట్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్​మల్కా కొమరయ్య తెలిపారు. ఈ వేడుకకు హాజరైన వారికి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను పంపిణీ చేస్తామని, చినజీయర్​స్వామి ఆధ్వర్యంలో జరగనున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.  రామమందిరం కోసం శతాబ్దాలుగా ప్రజలు ఎదురు చూస్తున్నారని

ఎట్టకేలకు కోరిక తీరబోతున్నందున మందిర ప్రాముఖ్యతపై చిన జీయర్ స్వామి ప్రసంగించి, పూజలు  చేస్తారని  తెలిపారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి  ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ సభ్యుడు  కె. లక్ష్మణ్, రాజకీయ నేతలు  బ్యూరోక్రాట్లు, ప్రముఖులను ఆహ్వానించామని కొమరయ్య పేర్కొన్నారు.  డీపీఎస్ లో స్కూల్ లో ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేయడమేంటని పీడీఎస్​యూ నేతలు ప్రశ్నించారు. మల్కా కొమురయ్య మల్కాజ్​గిరి  బీజేపీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నందునే  వేడుక  నిర్వహిస్తున్నారని ఆరోపించారు.  

రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కార్యక్రమాన్ని నిలిపివేసి  స్కూల్​పై చర్యలు తీసుకోవాలని  పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేశ్​, ప్రధాన కార్యదర్శి ఎస్​.వి శ్రీకాంత్ ఒక ప్రకటనలో​ డిమాండ్ ​చేశారు