- కలెక్టర్ హైమావతి
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి కల్యాణం, జాతర బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కొమురవెల్లి ఆలయాన్ని సందర్శించి పార్కింగ్ స్థలం, క్యూలైన్ కాంప్లెక్స్, షాపులను, సత్రం నిర్మాణ పనులు, కల్యాణం జరిగే మండపం ప్రాంతాన్ని పరిశీలించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ స్వామివారి కల్యాణం, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సోమవారం మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఉత్సవాల నిర్వహణపై ఆదేశాలు జారీ చేశారన్నారు. డిసెంబర్ 14న మల్లన్న కల్యాణంతో పాటు 18 జనవరి 2026 నుంచి 16 మార్చి 2026 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
కార్యక్రమంలో సిద్దిపేట, గజ్వేల్ ఆర్డీవోలు సదానందం, చంద్రకళ, ఆలయ ఈఓ వెంకటేశ్వర్లు, ఏఈఓ శ్రీనివాస్, ఆలయ పూజారి మల్లికార్జున్, డీపీవో విజయ్ కుమార్, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బీ, ఈఈలు, తహసీల్దార్ పాల్గొన్నారు.
అహ్మదీపూర్ పీహెచ్సీ తనిఖీ
గజ్వేల్: వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హైమవతి హెచ్చరించారు.గజ్వేల్ మండలంలోని అహ్మదీపూర్ పీహెచ్సీని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9.34 అయినా హెచ్ఈవో సత్యనారాయణ రెడ్డి, ఆయమ్మ మినహా మెడికల్ ఆఫీసర్ తో సహా మిగిలిన సిబ్బంది గైర్హాజరయ్యారు.
కలెక్టర్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేసి గైర్హాజరైన వారి వివరాలను నమోదు చేసి ఒక రోజు సాలరీ కట్ చేయాలని డీఎం హెచ్వోను ఫోన్ల ఆదేశించారు. సమయానికి రాకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
