అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సిటీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గల్లీలు మొదలుకొని కాలనీల వరకు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగాయి. ఎంపీ లక్ష్మణ్ ఆధ్వర్యంలో నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరై రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్‌లో చూశారు. అడిక్‌మెట్‌లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రత్యేక పూజలు చేశారు.
పద్మారావునగర్‌లోని స్కందగిరి ఆలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. కర్మన్‌ఘాట్ ఆంజనేయ స్వామి ఆలయం, లంగర్‌హౌస్ రామాలయం, లాలాపేటలోని శ్రీ సీతారామాంజనేయ ఆలయం, వికారాబాద్ జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయంలో మహిళలు 1,151 దీపాలతో అలంకరణ చేశారు. బేగంబజార్‌తో పాటు పలు ఏరియాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయగా.. ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు పటాకులు పేల్చి సంబురాలు చేసుకున్నారు.
