ఇండియాలో ఉండటం డౌటే..

ఇండియాలో ఉండటం డౌటే..

ప్రభుత్వ సాయం లేకపోతే  ఇంతే సంగతులే..

న్యూఢిల్లీ: విలీనం తర్వాత ఇండియాలో అతిపెద్ద టెల్కోగా అవతరించిన వొడాఫోన్ ఐడియా భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారబోతోంది. ఏజీఆర్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు అనంతరం.. ప్రభుత్వానికి ఈ కంపెనీ వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి విధానపరమైన సాయం రాకపోతే, ఇండియాలో మనుగడ అనుమానమేనని వొడాఫోన్ తేల్చేసింది. తమ గ్రూప్ ఇండియా జాయింట్ వెంచర్ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌‌ భవిష్యత్‌‌లో ఇండియాలో మనుగడ సాధించేందుకు పేమెంట్ డిమాండ్స్‌‌లో  ప్రభుత్వం కాస్త ఊరటనివ్వాలని  వొడాఫోన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ రీడ్ చెప్పారు. సపోర్ట్ లేని రెగ్యులేషన్, అత్యధిక పన్నులు, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో ఆర్థికంగా అత్యధిక భారాన్ని భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీర్ఘకాలంలో ఇది చాలా ఛాలెంజింగ్ పరిస్థితి అని వివరించారు. ఎలాంటి రిలీఫ్ ప్యాకేజీ రాకపోతే మాత్రం ఇండియాలో ఉండటం చాలా కష్టమేనని వ్యాఖ్యానించారు.

ఇండియా వ్యాపారాల నష్టం రూ.5,465 కోట్లు

ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో ఇండియా వ్యాపారాల నుంచి వొడాఫోన్‌‌కు వచ్చిన నష్టాలు 692 మిలియన్ యూరోలుగా(రూ.5,465 కోట్లుగా) ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో ఇవి 133 మిలియన్ యూరోలు మాత్రమే. సెప్టెంబర్ 30తో ముగిసిన ఆరు నెలల కాలంలో గ్రూప్‌‌కు వచ్చిన నష్టాలు 1.9 బిలియన్ యూరోలుగా కంపెనీ చెప్పింది. ఇండియా వ్యాపారాలకు ఈక్విటీ అందించే విషయాలపై గ్రూప్‌‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఫలితాల ప్రకటన సందర్భంగా వొడాఫోన్ తెలిపింది. లైసెన్స్, ఇతర రెగ్యులేటరీ ఫీజులను లెక్కించే విషయంలో ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి దశాబ్దం కిందట నుంచి జరుగుతున్న వివాదానికి ఇటీవల సుప్రీంకోర్టు ఫుల్‌‌స్టాప్ పెట్టింది. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో ఇండస్ట్రీ రూ.1.4 లక్షల కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. దీనిలో అత్యధికంగా వొడాఫోన్ ఐడియానే చెల్లించాల్సి ఉంటుంది. వొడాఫోన్‌‌ ఐడియా ఏజీఆర్‌‌ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం రూ. 46 వేల కోట్ల దాకా ఉంటుంది. ఏజీఆర్‌‌ చెల్లించేందుకు టెలికం కంపెనీలకు సుప్రీం కోర్టు మూడు నెలల గడువు విధించింది. ఐతే, వొడాఫోన్‌‌ ఐడియా, ఎయిర్‌‌టెల్‌‌లు ప్రభుత్వం ఏదైనా రిలీఫ్‌‌ ప్రకటిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నప్పటికి, ఇప్పటిదాకా కేంద్రం ఎలాంటి ఊరటా ప్రకటించలేదు.

Situation critical: Vodafone's future in India in doubt after court ruling