భారత రైతుల నిరసనలకు విదేశీ ప్రధాని మద్దతు

భారత రైతుల నిరసనలకు విదేశీ ప్రధాని మద్దతు

ఒట్టావా: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై రగడ నడుస్తోంది. ఈ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో ఈ అంశంపై స్పందించారు. నిరసనలకు దిగుతున్న రైతులను ఆయన మద్దతు తెలిపారు. గురుపురబ్ సందర్భంగా సహచర కెనడా సిక్కు నేతలకు ట్రుడో విషెస్ చెప్పారు. అలాగే రైతుల పోరాటం గురించి పలు కామెంట్స్ చేశారు.

‘భారత్‌‌లో రైతుల నిరసనలకు దిగుతున్న విషయం గురించి మాట్లాడకపోతే నాకు ఉపశమనంగా అనిపించదు. అక్కడ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. మన కుటుంబాలు, స్నేహితుల గురించి మనం దిగులు పడుతున్నాం. శాంతియుత నిరసనలకు కెనడా ఎప్పుడూ మద్దతుగా నిలబడుతుంది. మేం చర్చలను విశ్వసిస్తాం. ఈ అంశం గురించి మా ఆందోళనలను భారత అధికారులకు తెలియజేయడానికి యత్నించాం’ అని ట్రుడో పేర్కొన్నారు. రైతుల నిరసనల గురించి స్పందించిన తొలి విదేశీ నేత ట్రుడో కావడం గమనార్హం.