బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటికే 61 రోజులు పూర్తి చేసుకుని, ఫైనల్‌కు కేవలం ఆరు వారాలు మాత్రమే మిగిలి ఉండగా, తొమ్మిదో వారం మరింత రసవత్తరంగా మారింది. ఈ వారం శనివారం ఎపిసోడ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంది. హోస్ట్ అక్కినేని నాగార్జున తన ఐకానిక్ సినిమా ‘శివ’ ఫ్లేవర్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను, హౌస్‌మేట్స్‌ను ఉర్రూతలూగించారు. అంతే కాకుండా హౌస్‌మేట్స్ అందరూ 'శివ' సినిమాలోని పాటలకు అద్భుతంగా డ్యాన్సులు చేసి అందరినిఎంటర్‌టైన్ చేశారు.
'శివ' రీ-రిలీజ్ హంగామా!
టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన 'శివ' (1989) సినిమా, అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా మరోసారి థియేటర్లలోకి రాబోతోంది. నవంబర్ 14న 4కే వెర్షన్‌లో ఈ కల్ట్ క్లాసిక్ రీ-రిలీజ్ అవుతుండడంతో, ఈ స్పెషల్ ఈవెంట్‌ను బిగ్ బాస్ వేదికపై గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. నాగార్జున తన కెరీర్‌ను మలుపు తిప్పిన 'శివ' సినిమాలోని పాట “బోటనీ పాఠముంది, మ్యాట్నీ ఆట ఉంది.. దేనికో ఓటు చెప్పరా” ట్యూన్‌కు ఎంట్రీ ఇవ్వగానే.. హౌస్‌లో పండుగ వాతావరణం నెలకొంది. అంతటితో ఆగకుండా, నాగార్జున తన రియల్ లైఫ్ అండ్ రీల్ లైఫ్ హీరోయిన్, భార్య అమలతో కలిసి రావడం ఈ వారం హైలైట్‌గా నిలిచింది.
నాగ్-అమల డ్యాన్స్
కేవలం నాగార్జున, అమల మాత్రమే కాక, 'శివ' సినిమాతో దర్శకుడిగా పరిచయమై టాలీవుడ్ గమనాన్నే మార్చేసిన క్రియేటివ్ జీనియస్ రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) కూడా బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చారు. ఈ త్రయం రాకతో స్టేజ్ కళకళలాడింది. నాగార్జున, అమల కలిసి రంగంలోకి దిగి, సినిమా పాటలకు స్టెప్పులేసి తమ అభిమానులకు కనువిందు చేశారు. ఈ పవర్‌ఫుల్ జంట డ్యాన్స్ చేస్తుంటే, కంటెస్టెంట్స్ కూడా జోడీలుగా విడిపోయి, వారితో కలిసి స్టెప్పులేసి బిగ్ బాస్ హౌస్‌లో ఒక మరచిపోలేని మ్యాజికల్ మూమెంట్‌ను సృష్టించారు. స్టేజ్ మీద ఆర్జీవీ సైతం ఈ ఉల్లాసభరితమైన వాతావరణాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు.
ఆర్జీవీ సెటైర్స్
ఈ సందడి మధ్యలో నాగార్జున సరదాగా వర్మను పలకరించి, "నిన్ను బిగ్ బాస్ హౌస్‌లో వంద రోజులు ఉండమంటే ఉంటావా?" అని అడిగారు. అందుకు ఆర్జీవీ తనదైన శైలిలో చురక అంటించారు. "అందరూ సంజనాలాంటి అందమైన అమ్మాయిలుంటే కచ్చితంగా ఉంటాను" అంటూ వర్మ ఇచ్చిన హాస్యభరితమైన సమాధానం నవ్వులు పూయించింది.
1989 అక్టోబర్ 5న విడుదలైన 'శివ' తెలుగు సినిమా ట్రెండ్‌ను మార్చింది. యాక్షన్ సీన్లలో సైకిల్ చైన్ వాడకం వంటి టెక్నిక్స్‌తో పాటు, యువత రాజకీయాలను అద్భుతంగా తెరకెక్కించి ఆర్జీవీ తెలుగు సినిమాకి కొత్త ఒరవడి సృష్టించారు. ఇప్పుడు 36 ఏళ్ల తర్వాత ఈ సినిమా 4కే డాల్బీ అట్మాస్ సౌండ్‌తో రీ-రిలీజ్ అవుతుండడం అక్కినేని అభిమానులకు, తెలుగు సినీ ప్రియులకు నిజంగా పండుగే.
