సెప్టెంబర్ 5న టాలీవుడ్ లో బిగ్ ఫైట్..

సెప్టెంబర్ 5న టాలీవుడ్ లో బిగ్ ఫైట్..

జులై మూడో వారంలో పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, నెలాఖరులో విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ రాబోతున్నాయి. ఆగస్టు రెండో వారంలో ఎన్టీఆర్‌‌‌‌ ‘వార్‌‌‌‌ 2’,  రజినీకాంత్‌‌ ‘కూలీ’ పోటీపడుతున్నాయి. అదే నెల చివరలో రవితేజ నుంచి ‘మాస్‌‌ జాతర’ వస్తోంది.  అయితే సెప్టెంబర్‌‌‌‌ మొదటి వారంలో మాత్రం ఏకంగా ఆరు సినిమాలు పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ నిర్మాతల చూపు సెప్టెంబర్‌‌‌‌ 5పై పడింది. తెలుగు నుంచి ఈ డేట్‌‌కు వచ్చేందుకు మూడు సినిమాలు ఆసక్తి చూపిస్తుండగా, కోలీవుడ్‌‌ నుంచి కూడా మూడు సినిమాలు పోటీపడబోతున్నాయి. 

‘మిరాయ్’ యాక్షన్‌‌ అడ్వంచర్స్‌‌ 

ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ‘మిరాయ్‌‌’ గురించి. ఏడాది క్రితమే సెప్టెంబర్‌‌‌‌ 5న వస్తోందంటూ రిలీజ్‌‌ డేట్‌‌ ఫిక్స్ చేశారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు ‘హనుమాన్‌‌’ తర్వాత తేజ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అంచనాలు 
నెలకొన్నాయి. 

‘ఘాటీ’ క్రైమ్ డ్రామా

అనుష్క హీరోయిన్‌‌గా క్రిష్‌‌ తెరకెక్కించిన క్రైమ్ డ్రామా ‘ఘాటీ’ ఈనెల 11న విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌‌ పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. సెప్టెంబర్‌‌‌‌ 5న రిలీజ్‌‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. యూవీ క్రియేషన్స్‌‌తో కలిసి రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్​ కాంబినేషన్‌‌లో వస్తున్న చిత్రం కావడంతో ఎక్స్‌‌పెక్టేషన్స్‌‌ నెలకొన్నాయి. 

‘ది గర్ల్‌‌ ఫ్రెండ్‌‌’ లవ్‌‌ స్టోరీ

రష్మిక మందన్న,  దీక్షిత్ శెట్టి లీడ్‌‌ రోల్స్‌‌లో నటుడు రాహుల్ రవీంద్రన్‌‌ తెరకెక్కిస్తోన్న  లవ్‌‌ స్టోరీ ‘ది గర్ల్ ఫ్రెండ్‌‌’ రిలీజ్‌‌కు రెడీగా ఉంది. గీతా ఆర్ట్స్‌‌ నుంచి వస్తున్న ఈ సినిమాను కూడా సెప్టెంబర్‌‌‌‌ 5నే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం రష్మికకు ఉన్న క్రేజ్‌‌ దృష్ట్యా ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది.  

మదరాసి, భద్రకాళి

శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌‌‌‌ ‘మదరాసి’ని కూడా సెప్టెంబర్‌‌‌‌ 5న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్‌‌తో తీసిన ‘సికందర్‌‌‌‌’ డిజాస్టర్‌‌‌‌ కావడంతో శివకార్తికేయన్‌‌ కంటే మురుగదాస్‌‌కు ఈ సక్సెస్ ఎంతో అవసరం. ఇక అదే రోజున విజయ్ ఆంటోని నుంచి ‘భద్రకాళి’ అనే పొలిటికల్ థ్రిల్లర్ వస్తోంది. అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. సొంత బ్యానర్‌‌‌‌లో విజయ్ ఆంటోని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రి సంస్థ విడుదల చేస్తోంది. తమ నెక్స్ట్‌‌ మూవీకి ‘పరాశక్తి’ అనే టైటిల్‌‌ విషయంలో పోటీపడి ఒకే పేరుతో వస్తున్న ఈ ఇద్దరు హీరోలు.. రిలీజ్ డేట్‌‌ విషయంలోనూ పోటీపడుతున్నారు. 

‘కాంతా’ కూడా..

మరోవైపు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌‌ నటిస్తూ, నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘కాంతా’ కూడా ఇదే డేట్‌‌కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1950 బ్యాక్‌‌డ్రాప్‌‌లో తెరకెక్కుతోన్న ఈ పీరియడిక్ డ్రామాకు తెలుగులో రానా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్‌‌‌‌లో దుల్కర్‌‌‌‌ ‘లక్కీ భాస్కర్‌‌‌‌’, శివకార్తికేయన్ ‘అమరన్‌‌’ ఒకే రోజు విడుదలై సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 

టీచర్స్‌‌ డేకు ఢీ అంటే ఢీ

మొత్తానికి టీచర్స్‌‌ డే అయిన సెప్టెంబర్ 5న ఏకంగా ఆరు సినిమాలు పోటీకి రెడీ అవుతున్నాయి. నిజానికి పోటీపడాలనే ఉద్దేశం ఏ ఒక్కరికీ లేకపోయినా, ఓటీటీ డీల్స్‌‌ లాంటి కారణాలతో ఆ డేట్‌‌కు రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ‘మిరాయ్‌‌’ మినహా ఇతర చిత్రాలేవీ రిలీజ్‌‌ డేట్‌‌ను అధికారికంగా ప్రకటించలేదు. మరి వీటిలో ఏయే సినిమాలు ఆ డేట్‌‌కు రాబోతున్నాయో చూడాలి!