V6 News

తాళాలు వేసిన ఆరు ఇండ్లలో చోరీలు.. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో కలకలం

తాళాలు వేసిన ఆరు ఇండ్లలో చోరీలు.. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలో కలకలం

నస్రుల్లాబాద్, వెలుగు: తాళాలు వేసిన ఆరు ఇండ్లలో దొంగలుపడ్డ ఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో కలకలం రేపింది. ఎస్సై రాఘవేంద్ర, బాధితుల వివరాల ప్రకారం.. గ్రామంలోని విశ్వేశ్వరరావు, కృష్ణ ప్రసాద్, గండిగల రాములు, గైని లచ్చప్ప, గైని రాధవ్వ, ఎం.పోచయ్య ఇండ్లలో ఆదివారం రాత్రి దుండగులు చోరీలకు పాల్పడ్డారు. ఇండ్లకు తాళాలు వేసుకొని కొందరు బంధువుల ఇండ్లకు వెళ్లగా మరికొందరు శుభకార్యాలకు వెళ్లారు.

ఇదే అదునుగా భావించిన దొంగలు తాళాలు పగులగొట్టి బీరువాల్లోని బంగారం, నగదు, వెండి, ఇతర వస్తువులను దోచుకెళ్లారు. ఆరు ఇండ్లలో దొంగతనాలకు పాల్పడగా రెండిండ్లలో ఎలాంటి నగదు దొరకలేదు. నాలుగిండ్లలో బంగారం, వెండి, నగదు పోయినట్లు పోలీసులు గుర్తించారు. ఎస్సై రాఘవేంద్ర గ్రామానికి వెళ్లి ఇండ్లను పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. క్లూస్​టీమ్ సిబ్బంది ఫింగర్​ఫ్రింట్స్​సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.