ఏఐసీసీకి ఆరుగురు పేర్లు!...భద్రాద్రికొత్తగూడెం డీసీసీ పీఠంపై ఉత్కంఠ..

ఏఐసీసీకి ఆరుగురు పేర్లు!...భద్రాద్రికొత్తగూడెం డీసీసీ పీఠంపై ఉత్కంఠ..
  • దాదాపు 30 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఏఐసీసీ అబ్జర్వర్
  • అందులో ఆరుగురు పేర్లతో ఏఐసీసీకి నివేదిక!

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం డీసీసీ పీఠం ఎవరికి దక్కుతుందోననే టెన్షన్ ఆశావహులు, కార్యకర్తల్లో నెలకొంది. ఇటీవల డీసీసీ అధ్యక్ష పదవికి ఆశావహుల వద్ద నుంచి ఏఐసీసీ అబ్జర్వర్ జాన్ అబ్రహం దాదాపు 30 మంది నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాగా, అందులో ఆరుగురు పేర్లతో ఏఐసీసీకి నివేదించారు. 

ఈ నెలాఖరు కల్లా ఫైనల్..

ఏఐసీసీ సెక్రటరీ, అబ్జర్వర్ జాన్ అబ్రహం ఇటీవల జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో  మూడు రోజుల పాటు పర్యటించారు. ముఖ్యకార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఆశావహుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించారు. దీని ద్వారా దాదాపు 30 మంది వరకు దరఖాస్తులు ఇచ్చారు. 

వీటి పరిశీలనతో పాటు నేతలు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఫైనల్​గా ఆరుగురు పేర్లను అబ్జర్వర్ ఏఐసీసీకి నివేదించారు. ఈ నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షుడిని పార్టీ హైకమాండ్​ ఖరారు చేసే అవకాశాలున్నాయని సీనియర్ నేతలు పేర్కొంటున్నారు. 

ఆశావహుల్లో ఉత్కంఠ..

పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీనే నమ్ముకొని ఉన్న వాళ్లు తమకే అధ్యక్ష పదవి లభిస్తుందనే  ఆశాభావంతో ఉన్నారు. మరో వైపు జిల్లాలో పార్టీని నడిపించే సత్తా తమకే ఉందని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారు పలువురు సీనియర్​నేతలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా మరోసారి డీసీసీ పీఠం తనకే వస్తుందని ప్రస్తుత అధ్యక్షుడు, ఫారెస్ట్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య ఆశతో ఉన్నారు. 

కాగా, మోత్కూరి ధర్మారావు, నాగ సీతారాములు, పసుపులేటి వీరబాబు, కొత్వాల శ్రీనివాస్, కోనేరు సత్యనారాయణ, తుళ్లూరి బ్రహ్మయ్య, బాలశౌరి, కంచర్ల చంద్రశేఖర్, వూకంటి గోపాలరావు, చింతలపూడి రాజశేఖర్, దేవీ ప్రసన్న, ఎడవల్లి కృష్ణ, బుడగం శ్రీనివాస్, సరెళ్ల నరేశ్, జూపల్లి రమేశ్​ప్రధానంగా పోటీలో ఉన్నారు. పార్టీలో కొత్తగా వచ్చిన వారితోపాటు పాత వారిని సమన్వయం చేసుకునే వారికే పార్టీ డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని క్రీయాశీలక కార్యకర్తలు పార్టీ హైకమాండ్​ను కోరుతున్నారు.