- నగర్ వన్ యోజన కింద 8.26 కోట్లు మంజూరు: పీసీసీఎఫ్ సువర్ణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పచ్చదనం పెంపు, కాలుష్య నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా నగర్ వన్ యోజన పథకం కింద రాష్ట్రానికి కొత్తగా మరో ఆరు అర్బన్ ఫారెస్ట్‌లను మంజూరు చేసింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ పార్కుల ఏర్పాటుకు మొత్తం రూ.8.26 కోట్లు కేటాయించినట్లు అటవీ దళాల ముఖ్య సంరక్షణాధికారి (పీసీసీఎఫ్) డా. సువర్ణ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
మంజూరైన నిధుల్లో ఇప్పటికే 70శాతం నిధులను తొలి విడతగా కేంద్రం విడుదల చేసిందన్నారు. కొత్తగా మంజూరైన అర్బన్ ఫారెస్ట్‌లు మూడు జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా మావల, యాపల్‌గూడ–II, మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మండలం ఇందారం, చెన్నూర్, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా యెల్లంపేట, చెంగిచెర్లలో అర్బన్ ఫారెస్టులు మంజూరయ్యాయన్నారు.
నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే ఈ అర్బన్ ఫారెస్ట్‌ల ప్రధాన ఉద్దేశమన్నారు. వీటిలో స్థానిక రకాల మొక్కలు విరివిగా నాటడంతోపాటు సందర్శకుల కోసం వాకింగ్ ట్రాక్స్, విశ్రాంతి కేంద్రాలు, పచ్చని మైదానాలను ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు, వృద్ధులు, వాకర్లకు ఇవి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని, పర్యావరణ పరిరక్షణ మరింత దోహదం చేయనున్నాయని అధికారులు పేర్కొన్నారు.
