గంజాయి పట్టివేత ..ఆరుగురు అరెస్ట్​

గంజాయి పట్టివేత ..ఆరుగురు అరెస్ట్​

గచ్చిబౌలి, వెలుగు : సిటీలో పలు ప్రాంతాల్లో సైబరాబాద్​ ఎస్ఓటీ పోలీ సులు దాడులు చేసి  భారీగా గంజాయి, గంజా చాక్లెట్లు, నిషేధిత సిగరెట్లను పట్టుకుని, ఆరుగురిని అరెస్ట్​ చేశారు.  బిహార్​కు చెందిన శిబు కుమార్​(19) జీడిమెట్ల రాంరెడ్డినగర్​లో కిరాణం షాప్​ నిర్వ హిస్తూ.. గాంజా చాక్లెట్లు, నిషేధిత సిగరెట్లు అమ్ముతున్నాడు. బాలానగర్​ జోన్​ ఎస్ఓటీ పోలీసులు  షాపుపై దాడి చేసి రూ.11,500 విలువైన 150 గంజాయి చాక్లెట్లను, సిగరెట్లను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా నిజాంపేట్​లో శేఖర్​ పాన్​షాప్​, కింగ్స్​ పాన్​షాప్​పై దాడి చేసి రూ.16,000 విలువైన 114 ప్యాకెట్ల నిషేధిత సిగరెట్స్​ను స్వాధీనం చేసుకున్నారు. పాన్​షాప్​ ల నిర్వాహకులు చంద్రశేఖర్​(34), బాలరాజ్​(23)ను అదుపులోకి తీసుకున్నారు. 

మాదాపూర్​ జోన్​లో..

బిహార్​కు చెందిన సీతారాంసింగ్​(60) పటాన్​చెరువు పరిధి వెంకటేశ్వర కాలనీలో ఉంటూ కిరాణ షాప్ ​నిర్వహిస్తున్నాడు. రామచంద్రాపురం బాలాజీనగర్​ లోని లేబర్​ అడ్డాలో సీతారాంసింగ్ ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన వలస కూలీలకు గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నాడు.  మాదాపూర్​ జోన్​ ఎస్​ఓటీ పోలీసులు వెళ్లి అతని వద్ద సంచిలో 1,960 గంజాయి చాక్లెట్లతో కూడిన 49 ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు . 

మరో కేసులో..

మియాపూర్​ పరిధి మదీనగూడకు చెందిన గణపతి సంతాన్​(22), మూసాపేట్​కు చెందిన తేజేశ్​(21) నారాయణఖేడ్​కు చెందిన జేతిలాల్ వద్ద భారీగా గంజాయి కొని తెచ్చి మియాపూర్​ ఆల్విన్​ క్రాస్​ రోడ్డు వద్ద అమ్మేందుకు యత్నించారు. మాదాపూర్​ జోన్ ఎస్ ఓటీ పోలీసులు వెళ్లి సంతాన్, తేజేశ్​ను అదుపులోకి తీసుకుని.. వారి వద్ద  2  కిలోల 127 ప్యాకెట్ల గంజాయి, రెండు సెల్​ఫోన్లు, వేయింగ్​ మెషీన్, రూ. 1400 నగదు స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. 

ధూల్ పేటలో అమ్మేందుకు గంజాయి తెస్తూ..

మెహిదీపట్నం :  మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఖందార్ తాలూకా ఘోడాజ్ గ్రామానికి చెందిన జీవన్ రామారావు రాథోడ్ (26) రైతు.  కర్ణాటకలోని బీదర్ జిల్లా బల్కి తాలూకా గర్మ తండాకు చెందిన ఆనంద్ భీమ్ సింగ్ జాదవ్ (27)కార్ డ్రైవర్. ఈజీగా  డబ్బు సంపాదించేందుకు గంజాయి కొని తెచ్చి ధూల్ పేటలో కేజీ రూ. 6 వేల చొప్పున 34 కిలోలను అమ్మేందుకు ఇన్నోవా కారులో వస్తున్నారు.  టాస్క్ ఫోర్స్ సీఐ బాలస్వామి, గుడిమల్కాపూర్ పోలీసులు తనిఖీలో చేసి అదుపులోకి తీసుకున్నారు. గంజాయితో పాటు ఇన్నోవా, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని, జీవన్, ఆనంద్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మొబైల్​ కోసం యువకుడి హత్య

   గంజాయి బ్యాచ్​ దారుణం 

పద్మారావునగర్ :  మొబైల్ కోసం యువకుడిని ఓ గంజాయి బ్యాచ్ దారుణంగా హత్య చేసింది. చిలకలగూడ పీఎస్  పరిధిలో ఘటన చోటు చేసుకుంది.  ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ గురువారం మీడియాకు తెలిపారు.  నంద్యాలకు చెందిన కంపరాజు అనిల్ కుమార్ గౌడ్ (23) చర్లపల్లిలో ప్రైవేటు జాబ్ చేస్తాడు.  ఈ నెల 6న సికింద్రాబాద్ లోని తన ఫ్రెండ్స్ వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత సికింద్రాబాద్ లో రేపల్లె  రైలు ఎక్కి తిరిగి చర్లపల్లికి వెళ్తుండగా సీతాఫల్ మండి స్టేషన్ వద్ద  ఐదుగురు సభ్యుల గంజాయి ముఠా అతడి మొబైల్ లాక్కోగా.. పెనుగులాట జరిగింది. 

దీంతో  దుండగులు అనిల్  ఛాతిపై కత్తితో బలంగా పొడవడంతో తీవ్ర గాయపడి స్పాట్ లోనే మరణించాడు. ఆ తర్వాత డెడ్ బాడీని చిలకల గూడ ఫుట్ పాత్ పై అర్ధరాత్రి పడేసి వెళ్లిపోయారు. జీహెచ్ ఎంసీ సిబ్బంది చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  సంకు రాహుల్​ (19), కాపరి సూరజ్​(21), మదన రవితేజ (19), ఎంకిగారి లక్ష్మణ్​(19) లను నిందితులుగా గుర్తించి అరెస్ట్  చేశారు.  మరో మైనర్​ నిందితుడు (16) ని జువైనల్ ​హోమ్​ కు తరలించారు. వీరిపై గతంలోను పలు కేసులున్నాయి. కేసును వేగంగా పరిష్కరించడంతో సిబ్బందికి పోలీస్ కమిషనర్ రివార్డు ఇచ్చి అభినందించారు.