
- వర్చువల్‌గా ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో వందల కొద్దీ నైపుణ్య శిక్షణ కేంద్రాలున్నా అత్యున్నత ప్రమాణాలతో శిక్షణ ఇచ్చే కేంద్రాలు తక్కువగానే ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నీలిట్– ఎన్‌ఐఈఎల్‌ఐటీ)లను ఏర్పాటు చేస్తున్నదని చెప్పారు. బుధవారం సికింద్రాబాద్‌లో నీలిట్ కేంద్రాన్ని ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. విద్యార్థులకు శిక్షణ అందించేందుకుగాను తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), నీలిట్‌లు ఒప్పందం చేసుకోగా, ఆ పత్రాలను నీలిట్ చెన్నై డైరెక్టర్ కేఎస్ లాల్ మోహన్, టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా ఎక్చేంజ్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ యుగం నడుస్తున్నదని, మన దేశం కూడా అందులో పట్టు పెంచుకుంటున్నదని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మన దేశ యువత ఐటీ రంగంలో సత్తా చాటుతున్నారని కొనియాడారు. ఈ రంగంలో మరింత ముందుకెళ్లేలా యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో నైపుణ్యాన్ని పెంచేలా నీలిట్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
నీలిట్ ద్వారా రాబోయే మూడేండ్లలో 5 వేల మందికి శిక్షణనిచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఇతర అనుబంధ రంగాల కోర్సులకు సంబంధించి స్టూడెంట్లకు మెరుగైన నైపుణ్య శిక్షణను అందిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. తద్వారా విద్యార్థులకు మంచి సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశోధనలకు కూడా ఈ కేంద్రాలు వేదికలుగా ఉపయోగపడుతాయని చెప్పారు. సికింద్రాబాద్, తిరుపతిలలో నీలిట్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించిన నెల రోజుల్లోనే ఆమోదం లభించడం, వాటిని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.
కాగా, ఐటీ ఎగుమతలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో దేశం ఏటా గణనీయ వృద్ధిని సాధిస్తున్నదని కిషన్ రెడ్డి తెలిపారు. మేకిన్ ఇండియాలో భాగంగా చాలా సంస్థలు దేశంలో పెట్టుబడులు పెడ్తున్నాయని చెప్పారు. అత్యున్నత నైపుణ్యం ఉన్న వారి కోసం ఆయా కంపెనీలు చూస్తున్నాయని, దానికి తగ్గట్టు విద్యార్థులకు నీలిట్ కేంద్రం శిక్షణను ఇస్తుందని చెప్పారు.
ఐటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నం: శ్రీధర్ బాబు
ఐటీ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్కిల్స్ పెంచడంలో నీలిట్ ఏర్పాటు గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు.
తెలంగాణ మహనీయులకు దక్కిన గౌరవం
కేంద్ర ప్రభుత్వం ఆధ్వరంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేందుకు కేంద్రం గెజిట్ రిలీజ్ చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన మహనీయులందరికీ సరైన గౌరవం దక్కిందని ఆయన అభిప్రాయపడ్డారు. తర్వాతి తరాలకు సెప్టెంబర్17 ప్రాధాన్యత, హైదరాబాద్ సంస్థాన విమోచన పోరాటం గురించి తెలిపేందుకు ఇది బాటలు వేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
విద్యాసాగర్ రావు హర్షం
ప్రతి ఏటా సెప్టెంబర్17న హైదరాబాద్ విమోచన దినంగా నిర్వహించాలని కేంద్ర హోంశాఖ ప్రకటించడంపై మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో భాగాలుగా ఉన్న ప్రాంతాల్లో మహారాష్ట్ర, కర్నాటక ప్రభుత్వాలు అధికారికంగా విమోచన దినోత్సవం చేపట్టేలా కేంద్రం నోటిఫికేషన్ జారీచేయడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. ఇంతవరకు తెలంగాణాలో అధికారికంగా విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించకపోవడం విచారకరమని తెలిపారు.