
- ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలి
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలేజీలో ఎంబీఏ ఫస్టియర్ స్టూడెంట్స్కు ఓరియంటేషన్
- అంబేద్కర్ కాలేజీ- నార్జోస్ యూనివర్సిటీ మధ్య కుదిరిన ఎంఓయూ
ముషీరాబాద్, వెలుగు: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి విద్యార్థికి స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలని కాకా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలేజీ కరస్పాండెంట్ జి. సరోజ వివేక్ సూచించారు. విద్యార్థులు ఉత్సాహంగా నేర్చుకుంటే కాలేజీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎంబీఏ కాలేజీలో ఫస్టియర్ స్టూడెంట్స్కు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సరోజా వివేక్, సీఈఓ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ ప్రొఫెసర్ శ్రీరాములు, ప్రీమియర్ గ్లోబల్ ఫైనాన్షియల్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు హాజరై కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సరోజా వివేక్ మాట్లాడుతూ.. ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఉద్యోగానికే పరిమితం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండే విధంగా ఆలోచన చేయాలని సూచించారు. డాక్టర్ లింబాద్రి మాట్లాడుతూ.. ఎంబీఏ కోర్స్ తోపాటు టెక్నాలజీని విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ, నార్జోస్ యూనివర్సిటీ కజకిస్తాన్ మధ్య ఎంఓయూ కుదిరింది. గ్లోబల్ నెట్వర్కింగ్ లో కాలేజీ ప్రయాణానికి ఇదో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని సుబ్బారావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రోగ్రాం లో ప్రిన్సిపాల్ డాక్టర్ అంజన్ కుమార్ తోపాటు ఫ్యాకల్టీ, సిబ్బంది పాల్గొన్నారు.