ఉప్పల్ జంక్షన్​లో ఏడాదిన్నరగా కొనసాగుతున్న పనులు

ఉప్పల్ జంక్షన్​లో ఏడాదిన్నరగా కొనసాగుతున్న పనులు
  • మెహిదీపట్నంలో పిల్లర్లు దాటని పరిస్థితి

సికింద్రాబాద్, వెలుగు: వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పాదచారుల కోసం ఉప్పల్, మెహిదీపట్నం ప్రాంతాల్లో చేపట్టిన స్కైవాక్​ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదిన్నర కింద మొదలైన నిర్మాణాలు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తికావాల్సి ఉంది. అధికారులు చెప్పిన టైం దాటిపోయి ఆర్నెళ్లు అవుతోంది. ఈ ఏడాది చివరికైనా పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో రోడ్లు దాటాలంటే చాలా కష్టంగా ఉంటోంది. 

జీబ్రా క్రాసింగులు ఉన్నప్పటికీ మితిమీరిన వేగంతో, ట్రాఫిక్​ సిగ్నల్స్​ జంప్ ​చేసేవారితో ప్రమాదాలు జరుగుతున్నాయి. దిల్​సుఖ్​నగర్, సికింద్రాబాద్, కోఠి, ఖైరతాబాద్, మాదాపూర్, హైటెక్​సిటీ ప్రాంతాల్లోనూ స్కైవాక్ లు నిర్మించాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదించింది. పైలట్​ప్రాజెక్టు కింద ఉప్పల్, మెహిదీపట్నం ప్రాంతాల్లో పనులు స్టార్ట్​చేశారు. అయితే ఆదిలోనే హంసపాదు అన్న చందంగా మొదటి దశ పనులు ఇంతవరకు పూర్తికాలేదు. 

మెహిదీపట్నంలో రూ.28 కోట్లతో..

మెహిదీపట్నం జంక్షన్ లో 380 మీటర్ల మేర రూ.28కోట్ల అంచనాతో స్కైవాక్​పనులు ప్రారంభించారు. ఇది గుడిమల్కాపూర్ వెళ్లే చౌరస్తా నుంచి మెహిదీపట్నం బస్టాండ్​ మీదుగా పీవీ ఎక్స్​ప్రెస్​వే, మిలిటరీ స్థలం వైపు ఉన్న బస్టాండ్​వరకు నిర్మిస్తున్నారు. రోడ్డుకు రెండు వైపులా ఉన్న బస్టాండ్లను కలుపుతూ సరికొత్తగా డిజైన్​చేశారు. స్కైవాక్​వెడల్పు 3.6 మీటర్లు ఉంటుంది. మొత్తం 16 లిఫ్టులు ఏర్పాటు చేయనున్నారు. 

అయితే పనులు మొదలయ్యాక డిజైన్​లో మార్పులు చేయడం, భూనిర్వాసితుల నుంచి వ్యతిరేకత రావడంతో పనులు ఇంకా స్టార్టింగ్​లోనే ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం కొన్ని పిల్లర్లు మాత్రమే వేశారు. మధ్యలో కొంతకాలం ఆగిన పనులు ఇటీవలే తిరిగి మొదలయ్యాయి. పనులు ఇదే విధంగా కొనసాగితే పూర్తవడానికి మరో ఏడాదిన్నర పడుతుందని స్థానికులు అంటున్నారు. 

రూ.35 కోట్లతో ఉప్పల్​లో..

సిటీలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఉప్పల్ జంక్షన్​ఒకటి. ఎల్​నగర్, వరంగల్ వైపు వెళ్లే ప్రతి వెహికల్​ఇటుగానే వెళ్లాల్సి ఉంది. ఇక్కడ రోడ్డు దాటాలంటే పాదచారులకు చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమస్యకు చెక్​పెట్టేందుకు నాలుగు రోడ్లను కలుపుతూ రూ.35 కోట్లతో 660 మీటర్ల  పొడవు, 9.25 మీటర్ల  ఎత్తు, 3 నుంచి 4 మీటర్ల వెడల్పులో స్కైవాక్​నిర్మిస్తున్నారు. నాగోలు రోడ్డు వైపు మెట్రో స్టేషన్, రామంతపూర్ రోడ్, ఉప్పల్ మున్సిపల్ సర్కిల్​ఆఫీస్​సమీపంలోని థీమ్ పార్కు, వరంగల్ బస్టాప్, పోలీస్​స్టేషన్, సబ్​స్టేషన్​ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్​పాయింట్లు పెడుతున్నారు. ఎనిమిది లిఫ్టులు, నాలుగు ఎస్కలేటర్లు, వాటిని ఆనుకుని ఆరు మెట్ల దారులు నిర్మిస్తున్నారు. 2021లో ప్రారంభమైన పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ ఏడాది మే నాటికి పూర్తిచేస్తామని హెచ్ఎండీఏ అధికారులు ప్రకటించాక మరో మూడు నెలలు గడిచిపోయాయి. కానీ ఇంకా 40 శాతం పనులు చేయాల్సి ఉందని స్థానికులు చెబుతున్నారు.