- అధికారుల నిర్లక్ష్యమే కారణం
హైదరాబాద్ సిటీ, వెలుగు: జియాగూడలో స్లాటర్ హౌస్ నిర్మాణానికి సంబంధించి 6 నెలలైనా టెండర్ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ప్రభుత్వం అనుమతిచ్చినా ఇంజినీరింగ్ ప్రాజెక్టు విభాగం అధికారులు పట్టించుకోవడం లేదు. కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాలు జారీ చేసినా లైట్తీస్కుంటున్నారు.
ఖర్చు బల్దియాదే అయినా..
జియాగుడ కబేళాను ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణం(ఈపీసీ) కాంట్రాక్ట్ పద్ధతిలో నిర్మించాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదించింది. దీనికయ్యే ఖర్చును పూర్తిగా బల్దియానే భరించాలని నిర్ణయించింది. డిజైన్లు రూపొందించడంతోపాటు టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం ఇంజినీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించడంతో పాటు అధికారులతో కలిసి జియాగుడలోని కబేళాను సందర్శించారు.
జియాగుడలో 11 ఎకరాల్లో స్థలంలో ఆధునిక హంగులతో కబేళాను నిర్మించాలని నిర్ణయించింది. కబేళా నిర్మాణానికి గతం ప్రభుత్వం 2018లో రూ.42.5కోట్ల అంచనా వ్యయంతో ‘డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ఓన్ అండ్ ట్రాన్స్ ఫర్’ పరిపాలన అనుమతి మంజూరు చేసింది. అయితే గత టెండర్ విధానం, కాంట్రాక్టర్, స్టేక్ హోల్డర్ల మధ్య విబేధాల కారణంగా నిర్మాణ పనులు మధ్యంతరంగానే నిలిచిపోయాయి.
అయితే సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో 11 ఎకరాల స్థలంలో ఆధునిక కబేళాను జీహెచ్ఎంసీ సొంత నిధులతో నిర్మించాలని నిర్ణయించింది. కానీ, నిర్మాణం మాత్రం జరగడంలేదు. డిజైన్లు, ఎవాల్యూషన్, అంచనాల రూపకల్పన, క్వాలిటీ చెకింగ్ ప్రతి అంశాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వాలని ఇంజినీరింగ్ అధికారులు పట్టుబడుతున్నారు.
ప్రతి డిజైన్ కూడా జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారులే తయారు చేయాలని, అందుకు ప్రత్యేకంగా ఐఐటీల్లో విద్యనభ్యసించిన ఇంజినీర్లతో డిజైన్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. అయినా ఆ డిజైన్ సెల్ ను పనిచేయడంలేదు. ఇలా పలు రకాల కారణాలతో స్లాటర హౌస్ నిర్మాణం ఆలస్యం అవుతుంది. దీంతో అక్కడ జనానికి దుర్వాసన ఇబ్బందులు తప్పడంలేదు.
