- అన్ని భద్రతా ప్రమాణాలు పాటించాల్సిందేనని స్పష్టీకరణ
హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ ఇన్లెట్ వద్ద నుంచి తవ్వకం పనులను మళ్లీ ప్రారంభించినట్టు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. యుద్ధప్రాతిపదికన పనులను చేయిస్తున్నట్టు చెప్పారు. శుక్రవారం ఆయన సెక్రటేరియెట్‌లో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనుల పురోగతిపై ఎమ్మెల్యే బాలూ నాయక్‌తో కలిసి అధికారులతో రివ్యూ చేశారు. టన్నెల్ పనులు చేసేటప్పుడు భద్రతా ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. టన్నెల్ చివరి పాయింట్ వరకూ మెరుగైన వెంటిలేషన్ ఉండేలా చూడాలని ఆదేశించారు.
ఇన్లెట్ వద్ద పనుల్లో భాగంగా 20 మీటర్ల మేర ఓపెన్ కట్తోపాటు.. భద్రతా చర్యలను చేపట్టినట్టు పేర్కొన్నారు. రెండు వైపులా నుంచి ఒకేసారి పనులు చేయిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం 50 మీటర్ల మేర టన్నెల్ పనులు జరిగినట్టు తెలిపారు. భౌగోళిక సమస్యల వల్ల ప్రాజెక్ట్‌కు ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తామన్నారు. ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం జరిగితే సహించేది లేదని, పనుల్లో నిర్లక్ష్యం తగదని స్పష్టం చేశారు.
2027 చివరి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి.. 2028 జూన్‌నాటికి ప్రారంభించేలా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఎస్ఎల్బీసీ పూర్తయితే.. నల్గొండలోని 3 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా రోజూ 3 టీఎంసీల నీటిని తీసుకెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎస్ఎల్బీసీ జీవనప్రదాయిని
అని చెప్పారు.
