ఉప్పల్ భగాయత్లో వడ్డెర ఆత్మగౌరవ భవన శంకుస్థాపన రసాభాస

ఉప్పల్ భగాయత్లో వడ్డెర ఆత్మగౌరవ భవన శంకుస్థాపన రసాభాస
  • ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అనుకూలంగా వడ్డెర సంఘ నేతల నినాదాలు
  •  ఇరువర్గాల మధ్య తోపులాట.. పోలీసుల లాఠీచార్జ్

ఉప్పల్​, వెలుగు : ఉప్పల్​ భగాయత్​లో రాష్ట్ర ప్రభుత్వం వడ్డెరుల కోసం నిర్మించనున్న ఆత్మగౌరవ భవనం శంకుస్థాపన సభ రసాభాసగా మారింది. కార్యక్రమానికి మంత్రులు రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో వడ్డెర సంఘ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగి లాఠీచార్జ్ కు దారితీసింది. బీసీ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న వడ్డెరుల ఆత్మగౌరవ భవన శంకుస్థాపన కార్యక్రమానికి బుధవారం ముహూర్తం నిర్ణయించారు. ఈ సభకు మంత్రులు హాజరవుతున్నట్టు ముందుగానే నిర్ణయించి ప్రకటించారు. దీంతో శంకుస్థాపన జరిగే ప్రాంతంలో భారీ ఏర్పాట్లు చేశారు. వడ్డెర సంఘాల నేతలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. 

మంత్రుల కోసం ఎదురు చూస్తుండగా  సమయానికి రావడం లేదని చెప్పారు. దీంతో వడ్డెర సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మంత్రులు రాకపోవడం తమను నిరాశకు గురి చేసిందని, చిన్న చూపు చూస్తుందని పేర్కొంటూ సభా స్థలిలో నిరసనకు దిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇందులో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారు, మద్దతు పలికే వారు రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు జోక్యం చేసుకుని వారించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోగా లాఠీ చార్జ్ చేశారు. 

దీంతోపరిస్థితి సద్దుమణిగి ఎట్టకేలకు భవన నిర్మాణానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు భూమిపూజ, శంకుస్థాపన చేశారు. బీసీ వర్గాల్లో అనైక్యత తెచ్చి చిచ్చు పెట్టే వ్యక్తులను ప్రోత్సహించరాదని ఆయన పేర్కొన్నారు. అలాంటి వ్యక్తుల పట్ల సంఘం నేతలు అప్రమత్తతతో మెలగాలని ఆయన కోరారు.