ఒంగోలులో స్వల్ప భూకంపం

ఒంగోలులో స్వల్ప భూకంపం

అర్ధరాత్రి సమయంలో ప్రకంపనలు.. పలు చోట్ల రోడ్లకు పగుళ్లు, నెర్రెలు

ఒంగోలు: ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో స్వల్పంగా భూమి కంపించింది. నిన్న అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా భూమి కంపించడం గుర్తించిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే ఇరుగు పొరుగు వారిని అప్రమత్తం చేయడంతో కలకలం రేగింది. మళ్లీ భూకంపం వస్తుందేమోనన్న భయంతో పెద్దలు రాత్రంతా జాగారం చేస్తూనే గడిపారు. ముఖ్యంగా మంగమూరు రోడ్డు, గాంధీ రోడ్డు, కర్నూల్ రోడ్డు వైపు వెళ్లే ప్రాంతాల్లో అర్ధరాత్రి 12.30 సమయంలో స్వల్పంగా భూమి కంపించినట్లు స్ధానికులు చెబుతున్నారు. భూమి కంపించడం గమనించి భయాందోళనకు గురైన స్థానికులు ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల రోడ్లకు పగుళ్లు ఏర్పడగా.. మరికొన్ని చోట్ల నెర్రెలు చీరినట్లు గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారి మాత్రమే ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు..  ఉదయం వరకు మళ్లీ ఎలాంటి ప్రకంపనలు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.